అగ్రకుల అహంకారానికి బలైన మొదటి స్టార్‌ రోసీ

పి.కె.రోసీ… మలయాళ సినీ చరిత్రలో కన్నీటి బొట్టుగా మిగిలిపోయింది. ఆమె అనుభవించిన బాధ, చేసిన పోరాటం బహుశా సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరూ ఎదుర్కొని వుండరు. అందుకే ఆమె జీవితం ప్రజలతో ముడిపడి ఉంది. మహిళలు అడుగు కూడా బయట పెట్టలేని కాలంలో సినీ రంగంలోకి ప్రవేశించింది. దళితురాలిగా పుట్టి అగ్రవర్ణ పాత్రను పోషించినందుకు వారి ఆగ్రహానికి గురయింది. ఇటీవలె గూగుల్‌ ఆమెను గుర్తు చేసింది. ఆమె 120వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో సత్కరించింది. మలయాళంలో మొదటి లీడ్‌ యాక్టర్‌గా చరిత్ర సృష్టించిన ఆమె బాధాకర ప్రయాణాన్ని గుర్తు చేసింది
       ఫిబ్రవరి 10వ తేదీ నాడు ఎవరైనా గూగుల్‌ను తెరిచినట్టుయితే పి.కె రోసీని గౌరవించే అందమైన డూడుల్‌ను చూసి వుంటారు. గూగుల్‌ ఇంత గొప్పగా పరిచయం చేస్తున్న రోసీ ఎవరు? అనే సందేహం అందరికీ వచ్చి తీరుతుంది. తన విజయ మార్గంలో అనేక అడ్డంకులను అధిగమించిన ఒకప్పటి మలయాళ నటి. ఆమె దళిత క్రిస్టియన్‌ కమ్యూనిటీలో పుట్టారు. ఆమె పుట్టుకే ఆమె కష్టాలకు కారణమయింది. రోసీ మలయాళంలో మొదటి ప్రధాన నటి. 120 సంవత్సరాల కిందట ఫిబ్రవరి 10న జన్మించారు.
తండ్రి మరణించడంతో…
1903లో కేరళలోని తిరువనంతపురంలోని రోసమ్మగా జన్మించిన ఆమె ‘విగతుకుమారన్‌’ చిత్రంలో కథానాయికగా నటించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె సినిమాలపై తనకున్న ప్రేమను మాత్రం వదులుకోలేదు. రోసీ తల్లిదండ్రులు దినసరి కూలీలు. తండ్రి ఓ చర్చిలో వంటపని చేసేవాడు. జీవనోపాధి కోసం గడ్డి కోయడం, ఇండ్లల్లో వంట పని వంటి ఎన్నో పనులు వారు చేసేవారు. రోసీ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అప్పటి నుండే ఆమె కక్కరిస్సీ నాటకం నేర్చుకొనేందుకు స్థానిక ప్రదర్శన కళల పాఠశాలకు వెళుతుండేవారు. అలా ఇండ్లల్లో వంట పని చేస్తూనే తమిళం, మలయాళం థియేటర్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు.
ఇంటిని తగలబెట్టారు
1928లో ఆమె చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. మొదటి చిత్రంలోనే అగ్రవర్ణ నాయర్‌ అమ్మాయి సరోజిని పాత్రను పోషించారు. ఇది ఆనాటి అగ్రకులం వారికి అంతగా నచ్చలేదు. ఫలితంగా చిత్ర దర్శకుడు డబ్బును పోగొట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆ సినిమా కాపీని ఎవ్వరూ కొనలేదు. ఆ పాత్రలో నటించినందుకు రోసీ ఇంటిని తగలబెట్టారు. ఇలా నటన పట్ల ఆమెకున్న ప్రేమ ఎన్నో సమస్యలను ఎదుర్కొనేలా చేసింది.
పి.కె. రోసీ ఫిల్మ్‌ సొసైటీ
కండ్ల ముందే తల్లిదండ్రులు సజీవదహనం అయ్యారు. ప్రాణభయంతో ఆమె ఓ ట్రక్కులో ఎక్కి ఎటో పారిపోయారు. దాంతో ఆమె స్టార్‌ డమ్‌ గురించి ఎవరికీ తెలియకుండా కనుమరుగయింది. తర్వాత చాలా మంది ఆమె జీవితంపై బయోపిక్‌ తీయాలని, నవలలు రాయాలని నిర్ణయించుకున్నారు. ఆమె గౌరవార్థం మహిళా మలయాళ నటీనటుల బృందం కలిసి పి.కె. రోసీ ఫిల్మ్‌ సొసైటీని స్థాపించారు.
రహస్యంగా బతికారు
ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయిన ఆమె తర్వాత కాలంలో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అయితే కొంత మంది జర్నలిస్టులు చేసిన పరిశోధన ఫలితంగా రోజీ తన జీవితం చివరి వరకు తమిళనాడులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె కానీ, ఆమె భర్తకానీ వారి జీవితం గురించి బయటకు చెప్పుకోలేదు. ఏ పాత్ర అయితే పోషించినందుకు ఆమె దూషణనలకు గురయ్యిందో ఆ కులానికి చెందిన వ్యక్తితోనే (నాయర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తితో) ఆమెకు వివాహం జరిగింది. వారికి పద్మ అనే అమ్మాయి, నాగప్పన్‌ అనే కొడుకు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వాళ్ళు తమిళనాడులోనే నివసిస్తున్నారు.
రోసమ్మ కోసం పోటీ
1928 నాటికి ఆమె కక్కిరాసి, కోత పాటలు, జానపద పాటలను ప్రదర్శించే ”చేరమార్‌ కళావేదిక” అని పిలిచే కళాకారుల సంఘంలో ఉండేవారు. ఇది కళలు దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి శిక్షణా మైదానంగా మారింది. అప్పట్లో రోసమ్మ కోసం కక్కరాసి నాటక బృందం, రాజా పార్టీ డ్రామా ట్రూప్‌ ఒకదానితో ఒకటి పోటీ పడేవంట. ఈ పోటీనే నటి రోసమ్మ స్టార్‌ విలువను పెంచింది. అంతటి గుర్తింపు పొందిన ఆమె డేనిమల్‌ సినిమాలో మొదటి హీరోయిన్‌ పాత్రకు సరిపోతుందని ఎంపిక చేసుకున్నారు. అలా ఆమె ఆయన చిత్రంలో కథానాయికగా మారారు. ఈ చిత్రంలోనే ఆమె సరోజిని అనే నాయర్‌ మహిళ పాత్రను పోషించారు.
ఉగ్రరూపం దాల్చారు
‘విగతుకుమారన్‌’ విడుదలైనప్పుడు ఒక దళిత మహిళ నాయర్‌గా నటించడాన్ని చూసి భరించలేని నాయర్‌ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో విగతుకుమారన్‌ ప్రారంభోత్సవం చేయడానికి సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు నిరాకరించారు. అందులోని హీరో పాత్ర ఆమె జడలోని పువ్వును ముద్దాడిన సన్నివేశాన్ని చూసి ప్రేక్షకులు స్క్రీన్‌పై రాళ్లు విసిరారు. తిరువనంతపురంలోని క్యాపిటల్‌ థియేటర్‌లో జరిగిన ఓపెనింగ్‌కు దర్శకుడు డేనియల్‌ రోసీని ఆహ్వానించలేదు. ఎదురుదెబ్బ తగులుతుందనే భయం ఉన్నప్పటికీ రోసీ అక్కడకు వచ్చారు. అయితే ఆ ఈవెంట్‌ను బహిష్కరించినా ఆమె అక్కడే వుండి సెకండ్‌ షో చూశారు. దాంతో అగ్రకుల దురహంకారం మరింత ఉగ్రరూపం దాల్చింది. స్క్రీన్‌ను చించివేసి, థియేటర్‌ను పగలగొట్టారు. చివరికి రోసీ అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది.
ఆమె జీవితంపై సినిమాలు
ఈ సినిమా కథను 1960ల చివరలో చెలంగట్‌ గోపాలకృష్ణన్‌ మళ్లీ బయటకు తీసుకొచ్చారు. 1971లో కున్నుకుజీ ఆమె గురించి మొదటి కథనాన్ని ప్రచురించారు. 2013లో డేనియల్‌ బయోపిక్‌కి కమల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కొంత వరకు విను అబ్రహం రాసిన ‘నష్ట నాయక’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది రోసీ జీవితానికి చాలా దగ్గరగా వుంది. కొత్త నటి చాందిని గీత ఆమె పాత్రను పోషించింది. ఆమె జీవితంపై మరో రెండు సినిమాలు కూడా నిర్మించబడ్డాయి. అందులో ఒకటి ‘ది లాస్ట్‌ చైల్డ్‌ అండ్‌ ఇది రోసియుడే కథ (ఇది రోసీ కథ)”.

Spread the love