అటకెక్కిన ‘నిరుద్యోగ భృతి’

– చివరి బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించని సర్కారు
– యువత ఆశలు ఆవిరి
– అమలుకాని ఎన్నికల హామీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
‘ఒక్కొక్కరికీ నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం.’అంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచింది. ఈ ప్రభుత్వానికి 2023-24 బడ్జెట్‌ చివరిది. ఇందులోనూ నిరుద్యోగ భృతి ఊసేలేదు. దీంతో అది అటకెక్కినట్టేనని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘నిరుద్యోగ భృతి హామీ అమలుపై ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. కరోనా వల్ల ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోయాం. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏం చేయాలో అది చేస్తాం. నిరుద్యోగులంటే ఎవరు?అన్నది ముందు తేల్చాలి. దానికి ప్రాతిపదిక ఏంటన్నది ఆలోచిస్తున్నాం.’అని అసెంబ్లీలో 2021, మార్చి 17న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ‘నిరుద్యోగులకు తీపికబురు. అతిత్వరలోనే నిరుద్యోగ భృతి అమలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ప్రకటిస్తారు’అని మంత్రి కేటీఆర్‌ అదే ఏడాది జనవరిలో చెప్పారు. అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ఈ బడ్జెట్‌లో కచ్చితంగా నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ప్రకటిస్తుందంటూ యువతీ, యువకులు ఎంతో ఆశగా ఉన్నారు. కానీ 2023-24 బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, సెర్ప్‌ ఉద్యోగుల పేస్కేల్‌ సవరణను చేయెబోతున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. అయితే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-3, పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ వంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం యువతకు కొంత ఉపశమనంగా ఉన్నది. దరఖాస్తు చేసిన వారందరికీ ఉద్యోగాలు రావన్నది తెలిసిందే. దీంతో మిగిలిన వారంతా నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉన్నది. రాబోయే ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో వేచిచూడాల్సిందే.