అదానీ ఆస్తుల్ని జాతీయం చేయాలి

– బీజేపీ తన పవిత్రతను నిరూపించుకోవాలి : సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ వ్యవహారం మోడీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరోపణలు, అనుమానాలపై స్పందించాలని, దేశ ప్రజలకు జవాబు చెప్పాలని ప్రతిపక్ష నాయకులు మోడీ సర్కార్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యస్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూపు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి, వాటిని వేలం వేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాజాగా పీటీఐ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన..అదానీ వ్యవహారం, కేంద్ర బడ్జెట్‌, ముషారఫ్‌ మరణంపై సానుభూతి వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికా పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ వ్యవహారంపై సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ”అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలి. వచ్చిన నగదును ఇందులో నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలి. అదానీతో ఒప్పందాలు లేవని కాంగ్రెస్‌ చెబుతోంది. కానీ, అందులో అదానీతో ఒప్పందాలు ఉన్న వ్యక్తుల గురించి నాకు తెలుసు. అయినా కాంగ్రెస్‌ను పట్టించుకోను. బీజేపీ తన పవిత్రతను నిరూపించుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోడీ ఏదో దాచి పెడుతున్నారని ప్రజల్లో ఒక భావన ఉంది. దీనిపై స్పష్టతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదే” అని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.
ఇదొక బోగస్‌ బడ్జెట్‌..
సుబ్రహ్మణ్యస్వామి పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ మరణంపై సానుభూతి వ్యక్తం చేయటం విమర్శలకు దారితీసింది. ”కార్గిల్‌ యుద్ధానికి ముఖ్య కారకుడు నవాజ్‌ షరీఫ్‌. ఆయన ఇంటికి ప్రధాని మోడీ ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు నెటిజన్లు సమాధానమివ్వలేరు” అంటూ విమర్శకులకు సమాధానమిచ్చారు. అంతేగాక కేంద్ర బడ్జెట్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓ బోగస్‌ అని మండిపడ్డారు. కొన్నేండ్లుగా దేశ వృద్ధి రేటు 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటోంది. కానీ వచ్చే ఏడాదికి 6.5శాతం వృద్ధి రేటు ఉంటుందని కేంద్రం అంటోందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలకు బడ్జెట్‌లో ప్రాధాన్యతే లేదు. ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహం లేదన్న సంగతి బడ్జెట్‌లో కనపడుతోంది” అంటూ చురకలు అంటించారు.