అదానీ కోసం ఎల్‌ఐసి, ఎస్‌బిఐలు బలి..!

-కేద్రంపై మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు
హైదరాబాద్‌ : అదానీ గ్రూపు మోసాలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై మంత్రి కెటిఆర్‌ స్పందించారు. అదానీ గ్రూప్‌ స్టాక్‌ల్లో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలు వరుసగా రూ.77వేల కోట్లు, రూ.80వేల కోట్లు చొప్పున ఎందుకు పెట్టుబడులుగా పెట్టాల్సి వచ్చిందని కెటిఆర్‌ శనివారం ప్రశ్నించారు. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలను అలా నెట్టిందెవరు?.. అని కేంద్రాని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు సహాయం చేశారు?.. అని పేర్కొన్నారు. ఈ తీవ్రమైన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దెబ్బకు అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతం వరకు పతనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్లపై అదే విధంగా ఎల్‌ఐసి, ఎస్‌బిఐ షేర్లపై తీవ్రంగా పడుతోంది. ఇతర బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కూడా ఒత్తిడికి గురి అవుతున్నాయి.
మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించాలి : ఎంఎల్‌సి కవిత
స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులు, షేర్ల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్విట్టర్‌ ద్వారా ఆమె డిమాండ్‌ చేశారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సహా ఇతర షేర్లలో తగ్గుదల, ఒడుదొడుకులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి కేంద్రం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. దీనిపై నెలకొన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, సెబీ చీఫ్‌ మాధవి పూరీ బుచ్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లక్షలాది మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరఫున స్పందించాలన్నారు.