అప్పుల భారతం

– కేంద్రం అప్పు రూ.134.08 లక్షల కోట్లు
– ఆరేండ్లలో అప్పు రూ.68.81 లక్షల కోట్ల పెరుగుదల
– ప్రభుత్వరంగ సంస్థల్లో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు ఉపసంహరణ
– స్పష్టం చేసిన ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు ఏటా పెరిగిపోతున్నది. ప్రస్తుతం కేంద్రం అప్పు రూ.134.08 లక్షల కోట్లకు పెరిగిందని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. గత ఆరేండ్లలోనే కేంద్ర ప్రభుత్వం చేసిన రూ.68.81 లక్షల కోట్లు పెరిగినట్టు తెలిపింది. 15వ ఆర్థిక సిఫారసుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులనూ కేంద్ర ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయటం లేదు. దాదాపు రూ.30,878 కోట్లు ఇంకా విడుదల చేయకుండా కేంద్ర పెండింగ్‌లో ఉంచింది.
రూ.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో రూ.4.07 లక్షల కోట్లు సమకూరినట్టు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65 వేల కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా, 48 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుందని వెల్లడించింది. తద్వారా రూ.31 వేల కోట్లు ఖజానాకు చేరినట్టు పేర్కొంది. 2014 తరువాత ప్రయివేటు భాగస్వామ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఆర్థిక సర్వే తెలిపింది. ఐడీబీఐతో పాటు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌, బీఈఎంఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వంటి సంస్థలను విక్రయించే అంశంపై ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది.
ఎంఎస్‌ఎంఈలను ఆదుకున్న అత్యవసర రుణ హామీ
కరోనా కారణంగా బాగా దెబ్బతిన్న సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యసవర రుణ హామీ పథకం (ఈఎల్సిజీఎస్‌) ఆదుకుందని ఆర్థిక సర్వే చెప్పుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నామినల్‌ టెర్మ్స్‌లో 11 శాతం ఉంటుందని సర్వే అంచనా వేసింది. మౌలికాంశాలు బలంగా ఉండటం వల్ల భారత దేశ వృద్ధి నిలకడగా కొనసాగుతుందని పేర్కొంది. అత్యధిక మూలధన వ్యయం, ప్రైవేట్‌ వినియోగం, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలు పెరగడం, కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉండటం, వలస కార్మికులు తిరిగి నగరాలకు చేరుకుంటుండటం వంటివాటివల్ల జీడీపీ వృద్ధి నిలకడగా కొనసాగుతుందని తెలిపింది.
దేశంలో 12.6 శాతం మంది విద్యార్థుల డ్రాపౌట్స్‌ అయినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. లేబర్‌ కోడ్స్‌ కు సంబంధించిన గెజిట్‌ విడుదల చేసినట్టు తెలిపింది. వేతన కోడ్‌ను 31, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ 28, సామాజిక భద్రతా కోడ్‌ 28, ఆరోగ్య భద్రత, పని పరిస్థితుల కోడ్‌ 26 రాష్ట్రాలు నిబంధనలు విడుదల చేసినట్టు పేర్కొంది.
గ్రామీణ ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు
గ్రామీణ ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అత్యధిక గ్రామీణ ద్రవ్యోల్బణం నమోదు చేసుకున్నట్టు పేర్కొంది. దీనికి పెట్రోలియం, దుస్తులు ధరలు పెరగడమే కారణమని తెలిపింది.