అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

– ఎన్‌ఎస్‌యూఐ నాయకుల అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ప్రత్యేక నిఘా వేశారు. సివిల్‌, టాస్క్‌ఫోర్సు, ట్రాఫిక్‌, ఎస్బీ, ఇంటెలిజెన్స్‌తోపాటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. అనుమానితులను ఎవరినీ అసెంబ్లీ పరిసరాల్లోకి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అసెంబ్లీలోనికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. పాసులను పరిశీలించారు.అసెంబ్లీ ముట్టడికి యత్నంచిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రవీంద్రభారతి నుంచి అసెంబ్లీ వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నందకిషోర్‌, అక్షరురెడ్డిని గమనించిన డీజీపీ అంజనీకుమార్‌ వారిని అడ్డుకున్నారు. వారిని చిక్కడపల్లి ఏసీపీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విద్యావ్యవస్థకు అధిక నిధులు కేటాయించాలి
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా వ్యవస్థకు అధిక నిధులు కేటాయించాలని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు బల్మూర్‌ వెంకట్‌ డిమాండ్‌ చేశారు. పోలీసులు గుర్తించకుండా ఆయన బస్సులో వచ్చి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బడ్జెట్‌ సమావేశాల్లో విద్యావ్యవస్థకు అధిక నిధులు కేటాయించాలనీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలనీ డిమాండ్‌ చేశారు. అప్రమత్తమై పోలీసులు ఆయనతోపాటు పలువురు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అరెస్టు చేసి ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.