ఇంచు కూడా వెనక్కి తగ్గం

ముంబయి : నగరంలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌)లో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను ఆపేది లేదని ఆ విద్యాసంస్థకు చెందిన ప్రగతిశీల విద్యార్థి సంఘం తెలిపింది. ఈ విషయం లో ‘ఇంచు కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. కాగా, ఇన్‌స్టిట్యూట్‌ యాజమాన్యం ప్రదర్శనకు అనుమతి లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి స్పందనగా ప్రగతిశీల విద్యార్థి సంఘం ప్రకటన ప్రాధాన్యత ను సంతరించుకున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడికి వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ యూనివర్సిటీలలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసింది. డాక్యుమెంటరీ ప్రదర్శపై ప్రకటన రావడంతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ బయట బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయి యూనిట్‌ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఆందోళనలపై విద్యాసంస్థ అధికారుల నుంచి సంతృప్తికరమైన స్పందన రాలేదని, మా నిరసనను కొనసాగిస్తామని ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షులు తాజిందర్‌ సింగ్‌ తివానా తెలిపారు.