ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం

– అర్హులందరికీ డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
– 9న హైదరాబాద్‌ మహాధర్నాకు తరలిరావాలి : తెలంగాణ ప్రజాసంఘాల
ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
– రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా
– తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- మొఫసిల్‌ విలేకరులు
‘అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్స్‌ ఇవ్వాలి. అవి దక్కే వరకు పోరాటాలు చేస్తాం. స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. వీటిపైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇండ్ల పథకానికి అవసరమైన నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించాలి..’ అని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పేదలు పెద్దఎత్తున తరలివచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. హిమాయత్‌నగర్‌, హయత్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్ష, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సాధన కోసం ఈ నెల 9వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ప్రజల డిమాండ్‌ మేరకు ప్రజాపోరాటం చేయడంలో సీపీఐ(ఎం) ముందుంటుందన్నారు. ఇండ్లు లేని పేదలకు ఎర్రజెండా అండ, దండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నగరంలో పేదలకు లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో సీపీఐ(ఎం) కలిసి పనిచేసినా.. ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో వెనుకాడబోమని చెప్పారు. కాప్రా మున్సిపల్‌ ఆఫీసు వద్ద ధర్నాలో పట్నం రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఉచితంగా కేటాయిస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కరికీ ఇల్లు కేటాయించలేదని అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేదలు ఇండ్లు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన తెలిపారు.
సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు వందలాది మంది పేదలు దరఖాస్తులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందన్నారు. ప్రతిపక్షం కూడా పేదల ఇంటి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్స్‌ నిర్మించి ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొద్ది మందికే పరిమితం చేసిందన్నారు. పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కమిషనర్‌ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు.
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికి వినతిపత్రాన్ని అందజేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ డిమాండ్‌ చేశారు.
గుడిసవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బిరెడ్డి సాంబశివ మాట్లాడుతూ.. పస్రా పరిధి శివారు సర్వేనెంబర్‌-109లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. గుడిసెవాసులకు రూ.5లక్షలతో పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.