ఉద్యోగ అవకాశాలపై గట్టి దెబ్బ

– ప్రపంచవ్యాప్తంగా 30లక్షలకుపైగా ఉద్యోగాలకు కోత
– నిరుద్యోగుల సంఖ్య 21 కోట్లకు : ఐఎల్‌వో
– విద్య, శిక్షణ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి..
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌వో) హెచ్చరించింది. ఉపాధి, ఉద్యోగ రంగాలు 2023లో గణనీయంగా ప్రభావితం అవుతాయని ఐక్యరాజ్యసమితి కూడా కొద్ది రోజుల క్రితం ఒక నివేదిక విడుదల చేసింది. ఇదే అంశంపై ఐఎల్‌వో తాజాగా నివేదిక విడుదల కావటం గమనార్హం. నిరుద్యోగ రేటు భారీగా పెరిగే అవకాశ ముందని ఐఎల్‌వో నివేదిక అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలు..ఇవన్నీ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, వృద్ధిరేటును 1శాతానికి తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఇందులోని మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉపాధి రేటులో వృద్ధి 2023లో 1.5శాతం ఉండొచ్చని గతంలో ఐఎల్‌వో అంచనా వేయగా, దీనిని తాజాగా మరింత తగ్గించింది. తక్కువ వేతనాలకు, నాణ్యతలేని ఉద్యోగాలకు ఒప్పుకునేలా ప్రస్తుత ఆర్థికమాంద్యం పరిస్థితుల్ని సృష్టిస్తోందని నివేదిక పేర్కొంది. విద్య, శిక్షణ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందని, యువతకు సరైన చదువు, శిక్షణ లేకపోవటం వల్ల తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 30 లక్షల మంది కొత్తగా నిరుద్యో గులుగా మారుతారు. మొత్తంగా వీరి సంఖ్య సుమారుగా 21కోట్లకు చేరు కుంటుంది. నిరుద్యోగరేటు 5.8శాతానికి పెరుగుతుంది. అధిక ద్రవ్యోల్బణం ఆయా దేశాల్లో నిజ వేతనాల్ని మింగేస్తాయి. ఆర్థికమాంద్యం వృద్ధి గణాంకాల్ని, ఉపాధిరేటును దెబ్బతీస్తోంది. దీనినిబట్టి కోవిడ్‌-19 సంక్షోభం నుంచి ప్రపంచం 2025లోగా బయట పడేలా కనపడటం లేదని ఐఎల్‌వో రీసెర్చ్‌ విభాగం డైరెక్టర్‌ రిచర్డ్‌ సమాన్స్‌ అన్నారు.
పెరగనున్న జీవనవ్యయం
కార్మికరంగంలో వేతనాలు నామమాత్రంగా ఉన్నాయి. వీటితో పోల్చు కుంటే నిత్యావసర సరుకుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. అంతటా జీవనవ్యయం పెరగటం వల్ల మరింత మంది పేదరికంలోకి కూరుకు పోతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తే పరిస్థితి మరింత దిగజారు తుందని పరిశోధకులు అంచనావేశారు. దీనిపై ఐఎల్‌వో డైరెక్టర్‌ జనరల్‌ గిల్బర్ట్‌ హౌంగ్‌ మాట్లాడుతూ, కోవిడ్‌ సంక్షోభం నుంచి స్వల్ప, మధ్య ఆదా య దేశాలు పూర్తిగా బయటపడలేదు. దీనికితోడు వాతావరణ మార్పులు, మానవ సంక్షోభం కొత్త సవాళ్లను విసురుతున్నాయని ఆయన అన్నారు.