ఉపాధి, సమాన హక్కుల కోసం పోరాటం

– ముగిసిన డీవైఎఫ్‌ఐ మహిళా సమ్మేళనం
–  ఏప్రిల్‌ 5 జరిగే కిసాన్‌ మజ్దూర్‌ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం
న్యూఢిల్లీ : ‘ఉపాధి , సమాన హక్కుల కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని డీవైఎఫ్‌ఐ అఖిల భారత మహిళా సమ్మేళనం పిలుపు ఇచ్చింది. ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌ (హెచ్‌కేఎస్‌)లో రెండు రోజుల పాటు జరిగిన డీవైఎఫ్‌ఐ అఖిల భారత యువతుల సమ్మేళనం ఆదివారం ముగిసింది. 17 రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మోడీ పాలనలో ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ మహిళా వ్యతిరేక విధానాల వల్ల మహిళల జీవితం మరింత కష్టతరంగా మారిందని సమావేశం తీర్మానించింది. బేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలు చేస్తున్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళల అణచివేతను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ చేస్తున్న ఉద్యమాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించింది. దేశంలో నిరుద్యోగం ఎప్పటికప్పుడు అత్యధికంగా పెరుగుతోందనీ, లేబర్‌ మార్కెట్‌లో మహిళలు వివక్షకు గురవుతున్నారని పేర్కొంది. 2010 నుంచి 2020 మధ్య ప్రపంచ బ్యాంక్‌ చేసిన పరిశోధన ప్రకారం దేశంలో పనిచేసే మహిళల సంఖ్య 26 శాతం నుంచి 19 శాతానికి పడిపోయిందనీ, 2021లో గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో భారతదేశం 28 స్థానాలు పడిపోయిందని తెలిపింది. 156 దేశాలలో భారతదేశం 140 స్థానంలో ఉన్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘ఉపాధి కోసం పోరాటం, సమాన హక్కుల కోసం పోరాటం’ అనే నినాదంతో పోరాటం చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ సదస్సును అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ప్రారంభించారు. ప్రారంభో త్సవానికి డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎ ఎ రహీం అధ్యక్షత వహించి సదస్సులో ప్రసంగించారు. డీవైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్‌ భట్టాచార్య సమావేశ నివేదికను సమర్పించారు. దాని ఆధారంగా చర్చలు జరిగాయి. చర్చలకు మీనాక్షి ముఖర్జీ సమాధానమిచ్చారు. సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌, ఎంఎ బేబి ప్రతినిధులను ఉద్దేశించి పలు అంశాలపై వారు ప్రసంగించారు. గ్రీష్మా అజయ్ఘోష్‌, చింతా జెరోమ్‌, ఎస్‌ భారతి, ధృవబజ్యోతి సాహాతో కూడిన కన్వెన్షన్‌ ప్రిసిడియంకు మీనాక్షి ముఖర్జీ నాయకత్వం వహించారు. బీజేపీ ప్రభుత్వాలు సమాజంలో మనుస్మృతిని కొనసాగించడం, వరకట్నం వంటి పితృస్వామ్య నిబంధనల గురించి ఉత్తర భారత రాష్ట్రాల ప్రతినిధులు తమ ఆందోళనను పంచుకున్నారు. పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న మహిళా వలస కూలీలు అక్కడ కూడా వేధింపులకు గురవుతున్నారని చర్చల్లో ప్రతినిధులు పేర్కొన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, ప్రయివేటు రంగంతో సహా అన్ని రంగాల్లో ప్రసూతి సెలవులు, అన్ని ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి సంస్కరణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుతుక్రమ సెలవులు కల్పించడం కోసం డీవైఎఫ్‌ఐ బలమైన ఉద్యమాలు చేపడుతుందని తీర్మానించారు. స్వతంత్ర ప్రచారాలు, కార్యక్రమాలతో పాటు మహిళా అణచివేత, ఇతర సమస్యలపై ఉమ్మడి ఉద్యమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. యువతుల హక్కుల కోసం పోరాడే క్రమంలో సంఘాన్ని కూడా బలోపేతం చేయాలని నిర్ణయించారు.
కిసాన్‌ మజ్దూర్‌ ర్యాలీలో భాగస్వామ్యం
ఏప్రిల్‌ 5న జరిగే మజ్దూర్‌ కిసాన్‌ ర్యాలీలో పాల్గొనాలని డీవైఎఫ్‌ఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయించింది. దేశంలోని రైతులు, కార్మికులను ప్రభావితం చేసే సమస్యలు యువతకు కూడా సమానంగా ఉన్నాయని పేర్కొంది..

Spread the love