ఐక్యపోరాటాలతో ముందుకెళ్తాం

– ఐక్య పోరాటాలకు సీఐటీయూ కేంద్ర బిందువు కావాలి
– సీఐటీయూ రాష్ట్ర మహాసభల ప్రారంభ సభలో ట్రేడ్‌ యూనియన్ల నాయకులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేస్తామనీ, దానికి సీఐటీయూ కేంద్రం బిందువు కావాలని కార్మిక సంఘాల నాయకులు ఆకాంక్షించారు. కనీస వేతనాల జీవోల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. సిద్దిపేటలోని మల్లుస్వరాజ్యం నగర్‌లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలను ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు
సౌహార్ధ్ర సందేశాలను ఇచ్చారు.
సిద్ధిపేట నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కార్మిక సంఘాల ఐక్యత పెరిగింది ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో కార్మిక సంఘాల ఐక్యత పెరిగింది. భావజాలాలు వేరైనప్పటికీ హక్కులే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా కేంద్ర కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను నిర్వీర్యం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు ఉధృతంగా సాగాల్సిన అవసరముంది. రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కనీస వేతనాల జీవోలను కూడా విడుదల చేయలేదు. దీనికోసమూ పోరాటాలు ఉధృతంగా చేయాలి.
ఐక్యపోరాటాలకు కేంద్ర బిందువు సీఐటీయూ హెచ్‌ఎమ్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు
దేశంలో పదేండ్లుగా కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యంగా చేస్తున్న పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న సీఐటీయూకి విప్లవాభివందనాలు. జీహెచ్‌ఎంసీలో అన్ని సంఘాలు కలిసి ఐక్య పోరాటాలు, సమ్మె చేసి విజయం సాధించాం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కార్మికుల పట్ల ఒకే రకమైన విధానాలను అవలంబిస్తున్నాయి. దీనివల్ల కార్మికవర్గం తీవ్రంగా నష్టపోతున్నది. కనీస వేతనాల జీవోలను విడుదల చేయట్లేదు. సీఎం దగ్గరకు పోయి కార్మికుల సమస్యలపై చెప్పే మంత్రి నేడు లేని లోటు కనిపిస్తున్నది. నాయిని నర్సింహారెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వంలో కార్మికుల సమస్యపై కనీసం చర్చనైనా జరిగేది. ఇప్పుడు అది కూడా జరగట్లేదు.
బీజేపీ భావజాలాన్ని తిప్పికొట్టాలి…కాంట్రాక్టు ఉద్యోగులను నాయకత్వంలోకి తీసుకోవాలి టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్‌
యజమానుల్లోనూ, కార్మికుల్లోనూ బీజేపీ తన భావజాలాన్ని జప్పిస్తూ కార్మికులను చీల్చుతున్నది. లౌకికతత్వాన్ని దెబ్బతీసేలా ఆయా మతాల పండుగల సెలవుల రద్దు చేసేలా ఒత్తిడి పెరుగుతున్నది. ఇది ప్రమాదకరం. ఇలాంటి ధోరణులను కార్మికవర్గం ఐక్యంగా తిప్పికొట్టాలి. ఆర్థిక అంశాలకే కాకుండా కార్మిక సంఘాలు భావజాల పోరాటాలను విస్తృతపర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగులను నాయకత్వ స్థాయికి ఎదిగేలా అవకాశాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లకు క్రమంగా నిధులను తగ్గిస్తూ పోతున్నది. తాజా కొంత అమౌంట్‌ ఇస్తాం మీరే నిర్వహించుకోండి అని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేస్తున్నది. ఐక్యపోరాటాల్లో కలిసి ముందుకు నడుస్తాం.
అధికారంలో లేనప్పుడు ఒకలాగ..ఇప్పుడు మరోలాగా టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ
బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అధికారంలో లేనప్పుడు కార్మికుల విషయంలో ఒకలా మాట్లాడాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పినా, రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలనే డిమాండ్‌ వస్తున్నా ఎక్కడా అమలు కావడం లేదు. పదేండ్ల నుంచి వేతనాలు పెరగకపోతే కార్మికులు ఎలా బతుకుతారు?
సంపద సృష్టికర్తలు కార్పొరేట్లు కాదు… కార్మికులు, రైతులే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌రావు
సంపద సృష్టికర్తలు కార్పొరేట్లు అని ఆర్ధిక మంత్రి చెప్పటం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టిందే చావడానికి అని ప్రధాని మాట్లాడటం సిగ్గుచేటు. దేశంలో నిజమైన సంపద సృష్టికర్తలు కార్మికులు, రైతులే. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను తిప్పికొట్టాలి. అవి ఉంటేనే సమాజానికి మేలు. ఉపాధి అవకాలు మెరుగుపడతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు రావాలి. రైతులు ఐక్యంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలను బలమైన పోరాటం ద్వారా తిప్పికొట్టారు.