కరెంట్‌.. ఐదారుగంటలే

– కోతలపై బోధన్‌ రైతుల ఆగ్రహం..రాస్తారోకో
నవతెలంగాణ-బోధన్‌
పొలాల వద్ద కరెంట్‌ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 వరకు త్రీ ఫేస్‌ కరెంట్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని సాలూర సబ్‌స్టేషన్‌ ఎదుట అంతరాష్ట్ర రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. రోజుకు ఐదారు గంటలే కరెంట్‌ వస్తుందని, అది కూడా ఎప్పుడిస్తరో తెలియడం లేదని వాపోయారు. కరెంట్‌ కోసం పొద్దున్నుంచి రాత్రి వరకు పొలం వద్దనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులపై మోపిన ఏసీడీ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్క డికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం డివిజనల్‌ విద్యుత్‌ శాఖాధి కారులను కలిసి వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మండల కిసాన్‌ సెల్‌ రైతు అధ్యక్షులు హౌంసా, సొసైటీ చైర్మెన్‌ మందన్న రవి, సాలూర క్యాంప్‌ సర్పంచ్‌ శ్రీనివాసరావు, రైతు నాయకులు ఇల్తెపు రమేష్‌, చీల శంకర్‌, మురిగే శంకర్‌, అర్జున్‌ పటేల్‌, హన్మంత్‌ రావు, గోనేవార్‌ లక్ష్మణ్‌, రైతులు పాల్గొన్నారు.