కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం

బెంగళూరు: కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం లభించింది. అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ గ్రాట్యూటీ చెల్లింపులు ఇవ్వడంతో సహా మూడు ప్రధాన డిమాండ్లను కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు విజయం సాధించారు. తమ డిమాండ్ల సాధన కోసం జనవరి 23 నుంచి వారు నిరవధికంగా ఆందోళన చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకుషన్‌కు నిర్దిష్ట కాలపరిమితి వేళలు (ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు) విధించడం, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పది పాసైన వర్కర్లకు, హెల్పర్లకు పదోన్నతులు వంటివి ప్రభుత్వం ఆమోదించిన ప్రధాన డిమాండ్లలో వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి రాతపూర్వక హామీ రావడంతో వారు తమ ఆందోళన విరమించారు. ఫ్రీడం పార్క్‌లో సిఐటియు పెద్ద ఎత్తున నిర్వహించిన నిరసన కార్యక్రమం కూడా అంగన్‌వాడీలు విజయం సాధించడానికి ఎంతగానో దోహదపడింది.
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్‌ఇపి) పట్ల అంగన్‌వాడీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పిల్లల కోసం కొత్తగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అదే గనుక జరిగితే అంగన్‌వాడీలు మూతబడతాయనే భయాందోళనలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు నిర్దిషంగా కాలపరిమితిని ప్రభుత్వం విధించాలని సీఐటీయూ సూచించింది. వివిధ పథకాల కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు పనులు అప్పచెబుతున్నారని, కానీ వారికి తగిన సాయం అందడం లేదని సీఐటీయూ పేర్కొంది. మినీ అంగన్‌వాడీల్లోని వర్కర్లు ఎవరైనా 12వ తరగతి పూర్తి చేసినట్లైతే వారికి పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. దానిపై వర్కర్లు ఆందోళన వెలిబుచ్చడంతో తర్వాత ఆ ఉత్తర్వులను సవరిస్తూ పది పాసైన వారికి కూడా ప్రాధాన్యత కల్పించేలా కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సీనియారిటీకి కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లింపులను ఆమోదించినట్లు ఆర్థిక శాఖ నుండి సమాచారం వెలువడింది.  1975 నుండి అంగన్‌వాడీ కార్యకర్తలను పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వారికి వేతనాలు బదులుగా గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. తమను టీచర్లుగా వర్గీకరించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా వుంది. కానీ దాన్ని ప్రభుత్వం ఇంకా ఒప్పుకోలేదు.