కాళేశ్వరం తరహాలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు

– తెలంగాణకు గుజరాతీ కంపెనీలు
– ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రంగా సీతారాంపూర్‌
– త్వరలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- షాబాద్‌
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవల్లిలో వెల్‌స్పన్‌ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలో వెల్సన్‌ అడ్వాన్స్‌ మెటీరీయల్స్‌ సెకండ్‌ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌లో ప్రారంభించాల్సిన కంపెనీలు చందనవల్లిలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీతారాంపూర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రంగా మారబోతోందని చెప్పారు. ఐదేండ్ల కింద చందనవల్లిలో ఎలాంటి కంపెనీలు లేవని, ప్రస్తుతం రాష్ట్రంలోనే అతి పెద్ద కంపెనీలు చందనవల్లిలో ఏర్పాటు అవుతున్నాయని, భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు రాబోతున్నాయని చెప్పారు. సీతారంపూర్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీకి త్వరలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. వెల్సన్‌ కంపెనీలో 25 వేల మంది వరకు ఉపాధి లభిస్తుందన్నారు. కొత్తగా ప్రారంభించిన యూనిట్‌తో మరో 10వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రూ.3వేల నుంచి 5వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మహిళలకు, చదువుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. వెల్సన్‌ కంపెనీ ఎండీ బాలకృష్ణ గోయల్‌, చైర్మెన్‌ జీకే గోయాంకాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, నరేందర్‌ రెడ్డ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌ రెడ్డి, శంబీపూర్‌ రాజు, పరిశ్రమల శాఖ సెక్రటరీ జయష్‌ రంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love