కుల వ్యవస్థ స్థిరీకరణే బీజేపీ లక్ష్యం

– సామాజిక అభివృద్ధికి ఆపార్టీ నిధులెలా ఇస్తుంది? :
– కేవీపీఎస్‌ రౌండ్‌టేబుల్‌లో డీఎస్‌ఎంఎం నేత బీవీ రాఘవులు
– మనిషి కేంద్రంగా బడ్జెట్‌ రూపకల్పన లేదు: మల్లేపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో కుల వ్యవస్థ స్థిరంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌(డీఎస్‌ఎంఎం) జాతీయ నేత బీవీ రాఘవులు అన్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ సామాజిక అభివృద్ధికి అవసరమైన నిధులను ఎలా కేటాయిస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు – దళిత సాధికారిత’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షత వహించారు. రౌండ్‌ టేబుల్‌లో ముఖ్య వక్తగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ దేశంలో అనేక పార్టీలు గతంలో అధికారాన్ని చేపట్టాయని గుర్తు చేశారు. ఆయా పార్టీలన్నీ దళితుల అభివృద్ధికి తగిన కృషి చేయలేదని తెలిపారు. కానీ..ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దళితుల పట్ల గత పార్టీలతో పోలిస్తే భిన్నమైన వైఖరిని కలిగి ఉన్నదని వివరించారు. కుల వ్యవస్థ గుండెకాయగా సనాతన ధర్మం ముసుగులో మనుస్మృతి విధానాలతో పాలన కొనసాగుస్తున్నదని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం దళితులకు నిధులు కేటాయించకుండా వివక్ష పాటించిందని విమర్శించారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళితుల ఓట్లకోసం గాలం వేస్తున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ఎవరు చేసే పనిని వారు గౌరవిస్తే..నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారని గుర్తుచేశారు. దీని మర్మమేమిటో చెప్పాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశ్నించారు. శ్రమ గౌరవం ముసుగులో కుల వ్యవస్థను కొనసాగించటం కాదా? అని ప్రశ్నించారు. పాకీ పనిని, పౌరోహిత్యం చేయడాన్ని రెండింటిని ఒకే విధంగా మూడు వేల ఏండ్లుగా ఎందుకు చూడలేదో చెప్పాలన్నారు. కార్పొరేట్‌ శక్తులకు, అదాని వంటి బడా పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రభుత్వమే కొమ్ముకాస్తున్నదన్నారు. పేదలకు ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేసిందని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా బడ్జెట్‌లో గత రెండేండ్లలో సగానికి పైగా నిధుల కోత విధించారని గుర్తు చేశారు. ఆహార సబ్సిడీలు ఎత్తివేసిందన్నారు. పేదలకు ఉచితంగా ఇచ్చే ఐదు కేజీల బియ్యం ఇవ్వటం లేదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై 300 రెట్లు దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరిట మనుధర్మాన్ని బహిరంగంగా చర్చ చేస్తున్నారని వివరించారు. మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్మేస్తున్నదని తెలిపారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు లేవని చెప్పారు. ఈ రకంగా బీజేపీ సర్కారు సామాజికంగా, ఆర్థికంగా దళితులపట్ల వివక్ష చూపుతున్నదని చెప్పారు.ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో దళిత గిరిజనులను సమీకరించి రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవశ్యకత ఏర్పడిందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు గణనీయంగా ఉన్నప్పటికీ, ఖర్చు చేయడంలో విఫలమవుతున్నదని చెప్పారు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ మనిషి కేంద్రంగా బడ్జెట్‌ రూపకల్పన జరగాలని ఆకాంక్షించారు. ఆ బడ్జెట్‌ ప్రజల ఆర్థిక దిశ, సామాజిక స్థితిని మార్చే విధంగా ఉండాలన్నారు. బీజేపీ దృక్పథంలోనే ఈ కోణం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రజల కోసం కాదనీ, కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకోసమేనని గుర్తుచేశారు. దాంట్లో సామాజిక అంశాలను అసలు ప్రస్తావించలేదన్నారు. ఎనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎంతమందికి, ఏ తరగతులకు లబ్ది చేకూరిందో చెప్పాలని ప్రశ్నించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ బడ్జెట్‌ అంటే బాధితులకు దీపం కావాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితల అభివృద్ధి జరగటం లేదని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పటికీ దళితులపై దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని తెలిపారు.సంఫ్‌పరివార్‌ శక్తులే ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకి దక్కాలని ఆకాంక్షించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి శంకర్‌, పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ శివలింగం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి ఆశయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌, బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కడమంచి రాంబాబు, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు ఎండి సర్దార్‌, ఆడజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ ధనలక్ష్మి, కేవీపీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొట్ల శేఖర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పల్లెర్ల లలిత, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం కృపాసాగర్‌, ఎన్‌ బాల పీరు, హైదరాబాద్‌ జిల్లా నాయకులు ఎం దశరథ్‌, టి సుబ్బారావు బాలయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.