కేరళ తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

– మోటర్‌ వాహన చట్టం-2019 రద్దు చేసి ఆర్టీసీని పరిరక్షించాలి
– పెండింగ్‌ వేతన ఒప్పందం అమలు చేయాలి
– రవాణా రంగ కార్మికులు ఐక్యంగా పోరాడితే హక్కులు సాధ్యమే : సంగారెడ్డిలో సంఘర్ష యాత్ర ముగింపు సందర్భంగా చుక్క రాములు, ఎస్‌ వీరయ్య
– పట్టణంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రవాణా రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల సంక్షేమం కోసం కేరళ తరహా సంక్షేమ బోర్డును తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్‌ చేశారు.ఆల్‌ఇండియా పబ్లిక్‌ అండ్‌ ప్రయివేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) ఈ నెల 3వ తేదీన ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన ‘రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్ర బుధవారం సంగారెడ్డిలో ముగిసింది. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి సంగారెడ్డి బస్టాండ్‌ వరకు ఆటోలు, ట్రాలీలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నటరాజ్‌ థియేటర్‌ సెంటర్‌లో నిర్వహించిన ముగింపు సభలో చుక్క రాములు మాట్లాడారు. రాష్ట్రంలో ఆటో, కారు, టాక్సీ, ట్రాలీ, ప్రయివేట్‌ బస్సు, లారీ, డీసీఎం, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు.. ఇలా ప్రభుత్వ, ప్రయివేటు రవాణా రంగంలో లక్షలాది మంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. నెలంతా పనిచేస్తే వచ్చే ఆదాయంలో ముప్పావు వంతు టోల్‌ఫీజులు, పెనాల్టీలు, చలాన్స్‌కే సరిపోతుందని, మిగిలినదాంట్లోనే కుటుంబ వైద్య ఖర్చులు, పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలకు ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆర్టీసీలో బస్సులు తగ్గించడం మానుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన రెండు వేతన ఒప్పందాల్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఎన్నికలు జరపకుండా నిరంకుశ ధోరణి ప్రదర్శించడం సరైంది కాదన్నారు. మరో పక్క కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఉపయోగపడేలా మోటర్‌ వాహన చట్టం-2019 తీసుకొచ్చిందని, దీనివల్ల 15 ఏండ్ల తర్వాత ఏ వాహనమైనా రోడ్డుమీద నడిపే అవకాశంలేదన్నారు. దీని వల్ల పేద, మధ్య తరగతి వాళ్లు పాత వాహనాలు కొని నడుపుకునే వీల్లేదన్నారు. మోడీ రోడ్లు, విమానయానాలు, పోర్టులు, వనరుల్ని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు. రవాణా కార్మికులు ఐక్యంగా పోరాడితే చట్టపరమైన సంక్షేమ బోర్డు, ఇతర సదుపాయాల్సి సాధించుకోవచ్చన్నారు.
ఆల్‌ఇండియా పబ్లిక్‌ అండ్‌ ప్రయివేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ రవాణా రంగ కార్మికుల సమస్యలను అధ్యయనం చేసేందుకే చేపట్టిన సంఘర్షయాత్ర అనేక అనుభవాలను నేర్పిందన్నారు. ఈ నెల 3న ఖమ్మంలో ప్రారంభమైన యాత్ర 24 జిల్లాలు, 49 పట్టణాల్లో 2780 కిలో మీటర్లు పర్యటించామన్నారు. రవాణా కార్మికుల ఇండ్లల్లోనే యాత్ర బృందం బస, భోజనం, టిఫిన్‌ చేసిందని, ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాల స్థితిగతుల్ని పరిశీలించామన్నారు. కులం, మతం, ప్రాంతం అనే బేధబావాలు లేకుండా రవాణా కార్మికులందరూ యాత్రకు స్వాగతం పలికారన్నారు. మోడీ మాత్రం మతం పేరిట చిచ్చు రగిల్చుతూ కార్మికులు, కర్షకుల్ని విభజిస్తూ పాలిస్తున్నాడని విమర్శించారు.
ఎఐఆర్‌టీడబ్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. 2019 మోటర్‌ వాహన చట్టం వల్ల వాహనాలకు యజమానులుగా ఎవరున్నా వాటిని కంపెనీల్లోనే నడపాల్సి వస్తుందన్నారు. కనీసం వాహనం రిపేర్‌కు వస్తే కూడా కంపెనీలే చేస్తాయని, దీని వల్ల మెకానిక్‌, స్పేర్‌పార్ట్‌ వ్యాపారం దెబ్బతింటాయన్నారు. పోలీస్‌, ఆర్టీఎ అధికారుల వేధింపులు, పెనాల్టీలు, చలాన్స్‌ వ్యతిరేకంగా రాబోయే కాలంలో సమరశీలంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, బీరం మల్లేశం, ఎస్‌డబ్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం. యాదగిరి, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్యం, రవాణా రంగ నాయకులు వెంకటేశ్‌, మధు, మహేందర్‌, అన్వర్‌, సాయి, మల్లేష్‌, శ్రీనివాస్‌, రాహుల్‌ పాల్గొన్నారు.