కొలీజియంలో ప్రభుత్వాన్ని చేర్చాలి

– సీజేఐకి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లేఖ
– సుప్రీంకోర్టు స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్రం వ్యూహం
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నార్థకం చేసే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. న్యాయమూర్తుల నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు, మోడీ సర్కార్‌కు మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలంటూ కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్‌రిజిజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని రిజిజు ఈ సందర్భంగా కొత్త వాదానికి తెరలేపారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆయన లేఖలో ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్టు ఇటీవల కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలతో కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్టు కేంద్ర మంత్రి తరుచూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు..న్యాయమూర్తుల ఎంపికను కేంద్రం ఉద్దేశపూర్వకంగా పెండింగ్‌లో ఉంచుతోందని, సబార్డినేట్‌ కోర్టుల న్యాయమూర్తుల పోస్టులు లక్షల సంఖ్యలో ఖాళీలు ఏర్పడటం వెనుక కొలీజియం పాత్రమేముందని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నలు సంధిస్తోంది. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ కూడా ఇటీవల సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ని కొట్టేయడం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఉపరాష్ట్రపతి విమర్శించడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. అయితే ఈ విమర్శలకు సుప్రీంకోర్టు కూడా దీటుగా బదులిచ్చింది. కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవటం సరికాదని పేర్కొంది.