ఖమ్మం సభ చారిత్రాత్మకం

– దేశ రాజకీయాల్లో మైలు రాయిగా నిలుస్తుంది
– వందెకరాల్లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ
– 448 ఎకరాల్లో 20 పార్కింగ్‌ స్థలాలు
– నలుగురు సీఎంలతోపాటు సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు రాక : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ చారిత్రాత్మక సభ అవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌్‌ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో మైలు రాయిగా నిలుస్తుందని, రాజకీయాలను మలుపు తిప్పుతుందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ రానున్న కాలంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, విచ్ఛిన్నకర, వేర్పాటువాద ధోరణులతో పాలనగాడి తప్పిందని, అప్రజాస్వామిక విధానాలవల్ల దేశం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్‌ఎస్‌ అవతరిస్తుందని అన్నారు.
దేశంలో తెలంగాణ పాలన రోల్‌ మోడల్‌గా మారిందని, అందువల్ల వివిధ రాష్ట్రాలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని అన్నారు. ప్రజలు తెలంగాణ లాగానే తమ రాష్ట్రాల్లో కూడా రైతు బంధు అమలు చేయాలని, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని అక్కడ ప్రజలు కోరుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కావాలని అంటున్నారని తెలిపారు. పక్కనున్న కర్నాటక, మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని, ఇది మన రాష్ట్ర ప్రజా రంజక పాలనకు నిదర్శనమని అన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ సభకు కేసీఆర్‌ తోపాటు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌, సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం), సిపిఐ రాష్ట్రకార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు అందరు వేదికపై ఉంటారని అన్నారు. ఈ సభకు ఖమ్మం జిల్లాతోపాటు, 100 కిలోమీటర పరిధిలో ఉన్న డోర్నకల్‌, మహబూబాబాద్‌, పాలకుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌ నగర్‌ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలి రానున్నారని వివరించారు.
18న జరగనున్న భారీ బహిరంగసభను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నామని, 448 ఎకరాల్లో 20 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని తెలిపారు. సభకు ఐదు లక్షల మంది పైగా ప్రజలు హాజరు కానున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3 లక్షలకు పైగా వస్తారని అంచనా వేస్తున్నామని, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలు, పాలకుర్తి నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారని అన్నారు. సభకు వచ్చేందుకు ప్రజలనుంచి అపూర్వ స్పందన వస్తుందని, కానీ వాహనాలు దొరకటంలేదని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వాహనాలు తెప్పిస్తున్నామని తెలిపారు.
నేడే ముగ్గురు ముఖ్యమంత్రులు,
జాతీయ నేతలు రాక
ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు 17న రాత్రికే హైదరాబాద్‌ చేరుకుంటారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 18న ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారని చెప్పారు. యాదాద్రి దర్శనం చేసుకొని, అనంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారని తెలిపారు. ఖమ్మం నూతన కలెక్టరేట్‌ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్‌లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారని, సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. కళాకారులకు ప్రత్యేక వేదిక ఉంటుందని, రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు, పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్‌ రెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, రాములు నాయక్‌, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ లింగాల కమల్‌ రాజ్‌, డీసీసీబీ చైర్మెన్‌ కూరాకుల నాగభూషణం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌జెసి కృష్ణ, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, చంద్రావతి, చింతనిప్పు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.