గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్లు కేటాయించాలి

– టీపీసీసీ ఎన్నారై విభాగం డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో గల్ఫ్‌్‌ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలని టీపీసీసీ ఎన్నారై విభాగం చైర్మెన్‌ వినోద్‌కుమార్‌, కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 2014లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్‌ కార్మికులకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. గత ఎనిమిదేండ్లులో 1700 మంది తెలంగాణ వలస కూలీలు గల్ఫ్‌ దేశాలలో వివిధ కారణాలతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు శంషాబాద్‌ విమానాశ్రయం పోలీస్‌స్టేషన్‌లో శవపేటికల రిజిస్టరే సాక్ష్యమని వివరించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం ఆ కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ నుంచి వాపస్‌ వచ్చిన కార్మికుల పునరావాసం, పునరేకీకరణ గురించి ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టాలనీ, సమగ్ర ఎన్నారై పాలసీలో భాగంగా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం గల్ఫ్‌ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ప్రతినెలా రూ. 1,500కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారని తెలిపారు. ఎనిమిదేండ్ల కాలంలో లక్షా53 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి చేరాయని తెలిపారు. విలేకర్ల సమావేశంలో జగిత్యాల జుల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి గోపిడి ధనుంజయ రెడ్డి ఉన్నారు.