గూగుల్‌కు ఎన్‌సీఎల్‌టీ మరో షాక్‌..

న్యూఢిల్లీ: గూగుల్‌ ప్లే స్టోర్‌ అనైతిక వ్యాపార పద్దతులపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నిరాకరించింది. సీసీఐ విధించిన జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తుండటంతో సీసీఐ రూ.936.44 కోట్ల భారీ జరిమానా విధించింది. కాగా.. వారంలోనే ఎన్‌సీఎల్‌టీలో గూగుల్‌కు రెండోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో గూగుల్‌ గుత్తాధిపత్యంపై సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా వేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించగా.. తొలుత ఈ జరిమానా మొత్తంలో 10 శాతం సొమ్మును డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని గూగుల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. 16న విచారణకు రానుంది.