చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాలు కలుపుకొని ఈనెల 3వ తేదీన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షులు కే.ఏసురత్నం పిలుపునిచ్చారు. బుధవారం కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిల్‌ కార్యాలయాల వద్ద వారు మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.24000 ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలను గుర్తు చేస్తూ మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను, పారిశుధ్య, ఎలక్ట్రానిక్‌, పార్క్‌ ఆఫీసులో కంప్యూటర్‌, డ్రైవర్స్‌, అసిస్టెంట్‌, బిల్‌ కలెక్టర్లను వెంటనే పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శి రాములు, శేఖర్‌ కుత్బుల్లాపూర్‌, గాజులరామారంల జంట సర్కిల్‌ అధ్యక్షులు కార్యదర్శి వి.హరినాథ్‌రావు, వి.శ్రీనివాసులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు 80 నుంచి 100 రూపాయలు చార్జీలవుతున్నాయని.. ఒక నెలకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు చార్జీలకే ఖర్చవుతున్నాయని అన్నారు. ఇలాంటి కార్మికులను గుర్తించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కొంతమంది కార్మికులకు బయోమెట్రిక్‌ రావడంలేదని చెప్పారు. మూడు నుంచి నాలుగు నెలల వేతనాలు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.