చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

నవతెలంగాణ – చెన్నై
ఎయిరిండియా టాటాల సొంతమైన తర్వాత వరుస విమర్శలు, వివాదాల్లో కూరుకుపోతోంది. తాజాగా, ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఆ సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలిగాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్ కోసం అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంటూ ఎయిరిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకెళ్లేందుకు మీ వద్ద కనీసం వీల్‌చైర్ కూడా లేదా? అని ఎయిరిండియాను ప్రశ్నించారు. లిగ్మెంట్ గాయంతో బాధపడుతూ కట్టుతో ఉన్న తాను చెన్నైలో చక్రాల కుర్చీ కోసం కట్టుతో అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందని అన్నారు. చివరికి మీ సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌చైర్‌ను తీసుకొచ్చి తనను తీసుకెళ్లారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఖుష్బూ ట్వీట్‌కు ఎయిరిండియా వెంటనే స్పందిస్తూ క్షమాపణలు తెలియజేసింది. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని వెంటనే చెన్నై ఎయిర్‌పోర్టు సిబ్బందికి తీసుకెళ్తామని వివరణ ఇచ్చింది.