జీవోనెంబర్‌ 21ని గెజిట్‌ చేయాలి

– వ్యవసాయ మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సెక్యూరిటీ గార్డుల కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 21ని వెంటనే గెజిట్‌ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పాలడుగు భాస్కర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల సెక్యూరిగార్డ్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సమావేశాన్ని బుధవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల సాంబయ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం సహకార, వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వ్యవసాయ మార్కెటింగ్‌ సంచాల కులు, కార్మిక, ఉపాధి శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలను అంద జేశారు. పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కార్మిక శాఖ సెక్యూరిటీ సర్వీ సెస్‌కు సంబంధించిన జీవో నెంబర్‌ 21 విడుదలై రెండేండ్లు కావస్తున్నా నేటికీ గెజిట్‌ చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. మార్కెట్‌ యార్డులలో ప్రభుత్వ ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పొషిస్తున్న వేలాది మందిసెక్యూరిటీ గార్డులకు అన్యాయం చేయడం తగదన్నారు. తెలంగాణ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల సెక్యూరిగార్డ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న మాట్లాడుతూ.. సెక్యూరిటీ ఏజెన్సీలు ఈపిఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించడం లేదన్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులకు రావాల్సిన ప్రయోజనాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాటాలు చేసిన ఫలితంగా సెక్యూరిటీ ఏజెన్సీలు కాకుండా మార్కెట్‌ కమిటీలు నేరుగా ఈపిఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించాలని వ్యవసాయ మార్కెట్‌ సంచాలకులు మెమో నెం: ఎస్‌.1/363/2016 తేది: 08/02/2018 విడుదల చేశారని గుర్తుచేశారు. ఈ మెమోను మార్కెట్‌ కమిటీలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. వారికి కమిటీల ద్వారానే వేతనాలు చెల్లించాలనీ, మార్కెట్‌ యార్డులలో, చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సందర్భంలో అనేక ప్రమాదాలు జరిగిన పట్టించుకునే వారులేరన్నారు. ప్రమాదానికి గురైన సెక్యూరిటీ గార్డులందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగిడి లక్ష్మణ్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌. కుమార స్వామి, వై.రామాంజయ్య, ఎస్‌.రమేష్‌ కార్యవర్గ సభ్యులు ఉపేందర్‌, ఎండి. యాకూబ్‌ అలీ, బి. వెంకటేష్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.