జేబుకు చిల్లు

–  వృద్థికి ధరాఘాతం… 30 ఏండ్ల కనిష్టానికి పొదుపు
–  ద్రవ్యోల్బణం దెబ్బకు బతుకు భారం
న్యూఢిల్లీ : అధిక ధరలపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో తయారీ కంపెనీలు ఆ భారాలను ప్రజలపై నెట్టుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పెంచడంతో ఆ ప్రభావం అంతిమంగా వినిమయంపై పడుతోంది. హెచ్చు ధరలు వృద్థికి విఘాతంగా మారాయని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మరోవైపు కుటుంబాల పొదుపు 30 ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షకు భిన్నంగా గడిచిన కొన్ని త్రైమాసికాల్లో వినిమయం, పొదుపూ తగ్గడంతో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకున్నపప్పటికీ.. స్థూలంగా బలహీనంగానే ఉందని ఇటీవల నువామా ఇన్స్‌ట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ”దేశీయంగా వినియోగం తగ్గుదల స్పష్టంగా క్షీణిస్తోంది. పెట్టుబడుల వ్యయంలోనూ స్థబ్దత చోటు చేసుకుంటోంది. ఎగుమతులు తగ్గాయి.” అని తెలిపింది.
అట్టడుగువర్గాల వినియోగంపై దెబ్బ
గడిచిన జనవరిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 6.5 శాతానికి ఎగిసింది. గతేడాది డిసెంబర్‌లో ఇది 5.72 శాతంగా, నవంబర్‌లో 5.88 శాతంగా నమోదయ్యింది. 2022-23 ప్రథమార్థం (హెచ్‌1)లో దేశంలో ద్రవ్యోల్బణం సగటున 7.2 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం రెండేండ్లలో ఈ సగటు 5.8 శాతంగా చోటు చేసుకుంది. అధిక ఇన్‌పుట్‌ ధరలను పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని ఎదుర్కోవటానికి వివిధ రంగాలలోని కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై నెట్టుతున్నాయి. దీంతో ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వినియోగం, పొదుపు స్థాయిలు దెబ్బతింటున్నాయి. ”కరోనా తర్వాత దేశంలో వి-ఆకారపు వృద్థి చోటు చేసుకోనుందనే అంచనాలు నిరుత్సాహంగా కనబడుతున్నాయి. కారణంగా దేశంలో పారిశ్రామిక వద్ధి నిరుత్సాహకరంగా ఉంటోంది. ఇది వేతన వృద్థిపైనే ప్రభావం చూపుతుంది.” అని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది.
దిగజారిన పొదుపు
మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఒఎఫ్‌ఎస్‌ఎల్‌) విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబాల పొదుపు 4 శాతానికి పడిపోయింది. 2021-22 ఇదే హెచ్‌1లో జీడీపీలో ప్రజల పొదుపు స్థాయి 7.3 శాతంగా, కరోనా కాలం 2020-21లోనూ 12 శాతంగా పొదుపు ఉన్నది. గడిచిన ఐదేండ్లలో జీడీపీలో పొదుపు 20 శాతంగా ఉంది. దీంతో పోల్చితే గడిచిన హెచ్‌1లో ఇది 15.7 శాతం తగ్గుదలను నమోదు చేసింది. అదే విధంగా పసిడి, ఆస్తులు తదితర భౌతిక రూప పెట్టుబడుల పొదుపు తగ్గిపోయింది.
వత్తిడిలో వ్యవసాయ రంగం
”దేశీయ వినియోగం డేటాలో చాలా కాలంగా బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగం ఒత్తిడిలోనే ఉంది. వ్యవసాయేతర వేతనాల్లో నిరంతర పతనం చోటు చేసుకుటోంది. ద్విచక్ర వాహన విక్రయాలు తక్కువ వృద్థిని కనబర్చాయి. వాస్తవ వ్యవసాయ ఎగుమతులు కూడా తగ్గాయి. స్థూలంగా గ్రామీణ, పట్టణ వినియోగంలో తగ్గుదల చోటు చేసుకుంది.” అని ఎంఒఎఫ్‌ఎస్‌ఎల్‌ పేర్కొంది. నిరుద్యోగాన్ని నిర్మూలించడం, హెచ్చు ధరలను కట్టడి చేయడం, వేతనాల్లో పెంపుదల తదితర చర్యల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వృద్థికి మద్దతునివ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love