టర్కీ భూకంపం ఎఫెక్ట్‌

–  కోటి యాభై లక్షల మంది నిరాశ్రయులు
అంకారా : టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాల వల్ల లక్షలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ తీవ్ర భూకంపాల వల్ల టర్కీలో కోటి యాభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రకృతి ప్రకోపానికి ఇండ్లు కోల్పోయిన వారికి.. తిరిగి ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆ దేశ ప్రధాని ఎర్డోగాన్‌ ప్రకటించారు. ఇక ఈ తీవ్ర భూకంపాలకు వేలాదిమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా లెక్కల ప్రకారం టర్కీలో 44,218 మంది మృతి చెందగా, సిరియాలో 5,914 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే టర్కీలో ఈ ఏడాది జూన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎర్డోగన్‌ ప్రభుత్వం ఎన్నికల లక్ష్యంగా గృహాల పునర్నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. అయితే ఓట్ల కోసమే ఇండ్లను వేగంగా నిర్మించకుండా.. భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక నిపుణుల అభిప్రాయాలపై అధికారులు స్పందించారు. ‘ఇప్పటికే అనేక ప్రాజెక్టుల కోసం టెండర్లు, కాంట్రాక్టులు జరిగాయి. వాటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నది. నిర్మాణాల భద్రతపై ఎటువంటి రాజీ ఉండబోదని.. భద్రతతోనే నిర్మాణాలు జరుగుతాయని’ ఓ అధికారి తెలిపారు.

Spread the love