దేశమంటే అదానీ ప్రధానే కాదు

– 140 కోట్ల ప్రజలని చాటిచెప్పుదాం
– ఒక దొంగపై దాడిని దేశంపై దాడిగా ఎలా చిత్రీకరిస్తారు?
– మోడీ దేనికి, ఎవరికి దేవుడు?
– మేం రైతు రాజ్యమంటే.. మోడీ కార్పొరేట్ల రాజ్యమంటున్నారు
– మాకు సామాన్య పౌరుడే ముఖ్యం
– వేటకుక్కల్లా కొన్ని సంస్థలను ఉసిగొల్పి ఏమీ సాధించలేరు
– బీసీ జనగణనపై మోడీ సర్కారు మొండిపట్టు
– గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘తెలంగాణలో ప్రగతిలాగానే దేశంలో కూడా జరిగి ఉంటే 5 ట్రిలియన్ల డాలర్ల ఎకనామి లక్ష్యం ఎప్పుడో నెరవేరేది. అలా జరగట్లేదు. దొంగపై దాడి జరిగితే దేశంపై దాడి జరుగుతున్నట్టు ఎందుకు చిత్రీకరిస్తున్నారో అర్థం కావటం లేదు. దేశంలో ఇప్పుడు అదానీ, మోడీ గురించే చర్చ నడుస్తున్నది. ప్రధాని, అదాని మాత్రమే ఈ దేశానికి ప్రతినిధులా? దేశమంటే వారిద్దరే కాదు..140 కోట్ల ప్రజలని చాటి చెప్పాల్సిన అవసరముంది’ అని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యానించారు. తాము రైతు రాజ్యం కోసం కృషి చేస్తుంటే బీజేపీ సర్కారు కార్పొరేట్ల రాజ్యం స్థాపన కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. సంక్షేమ పథకాలు, ఉచితాలతో ప్రజలు సోమరిపోతులుగా మారుతున్నారంటూ బీజేపీ నేతలు మాట్లాడటమేంటని నిలదీశారు. ఆ పార్టీ నేతలు మోడీని దేవుడు, దేవుడు అంటున్నారనీ, ఢిల్లీలో జరిగిన రైతు ల పోరాటంలో 700 మంది రైతుల చావుకు కారణమైన ఆయన ఎవరికి దేవుడు? దేనికి దేవుడు? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలంగాణ మీదకు వేటకుక్కల్లాంటి సంస్థలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తమను ఏమీ చేరలేరనీ, వారికి రాష్ట్రంలో ఒరిగేదేమీ ఉందని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. తీర్మానాన్ని సండ్రవెంకటవీరయ్య ప్రవేశపెట్టగా…చర్చలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సభ్యులు కేపీ వివేకానంద, రఘునందన్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిలోనూ మంత్రి కేటీఆర్‌ ఇదే తీర్మానంపై మాట్లాడారు. ఇరు సభల్లోనూ సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎనిమిదున్నరేండ్ల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి క్రమాన్ని వివరించారు. సింగరేణి సంస్థ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని తెలిపారు. ఆ నాలుగు బ్లాకులను సింగరేణికి నేరుగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తమది ముమ్మాటికీ కుటుంబ పాలనేననీ, నాలుగు కోట్ల మంది తెలంగాణ కుటుంబసభ్యులకు కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. మోడీ సర్కారు ఎత్తుకున్న మేకిన్‌ ఇండియా ఏమైందో ఏమోగానీ మేకిన్‌ తెలంగాణ మాత్రం సాకారం అయిందని చెప్పారు. కంటివెలుగు పథకంలో భాగంగా ఇస్తున్న కండ్లద్దాలు సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ హబ్‌లో తయారు కావడమే దానికి సజీవ సాక్ష్యమన్నారు.
తెలంగాణ దేశానికి టార్చ్‌బేరర్‌
దేశాన్ని నడిపించే టార్చ్‌బేరర్‌గా నేడు తెలంగాణ మారిందని కేటీఆర్‌ ఈ సందర్భం గా అన్నారు. సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన విజన్‌ ఉందన్నారు. దేశంలో 20 అత్యుత్తమ గ్రామ పంచాయతీల్లో 19 మన రాష్ట్రానివేనని కేంద్రం చెప్పిందన్నారు. రైతు బంధు ప్రపంచంలోనే వినూత్న పథకమని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. రైతు బీమాతో 94 వేలకుపైగా కుటుంబాలను ఆదుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలను వివరించారు.
రోజూ మూడు డ్రెస్సులు మార్చితే అభివృద్ధి కాదు..
రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం.. ముచ్చట్లు పెట్టడం..హడావిడి చేయడం అభివృద్ధి కాదని పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కించపరిచే విమర్శలు చేయొద్దని హితవు పలికారు. నల్ల చట్టాలతో 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్నది మోడీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. మోడీ సర్కారు చెప్పినట్టు డిస్కంలను ఎందుకు ప్రయివేటీ కరించాలి? మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టాలి? అని నిలదీశారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుంటే గుజరాత్‌, యూపీలో పవర్‌ హాలిడేలు ప్రకటిస్తున్న పరిస్థితి ఉందన్నారు. కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు.
దేశం కోసం..ధర్మం కోసం అంటూనే లూటీ..
దేశం కోసం, ధర్మం కోసం అంటూనే మోడీ సర్కారు దేశ సంపదను కార్పొరేట్లకు లూటీ చేసిపెడుతున్నదని కేటీఆర్‌ విమర్శిం చారు. బీజేపీ సర్కారు రైతుల పట్ల కక్ష కట్టిందని తెలిపారు. దేశమంతటా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చినా ఖర్చు 1.45 లక్షల కోట్లకు మించబోదని చెప్పారు. కార్పొరేట్ల కోసం 12 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన కేంద్రం రైతుల కోసం 1.45 లక్షల కోట్లను ఖర్చుపెట్టలేదా? అని ప్రశ్నిం చారు. బుల్లెట్‌ ట్రైన్‌ వద్దంటే ఎడ్లబండి మీద తిరగండి అని మోడీ మాట్లాడారని తెలిపారు. అహ్మదాబాద్‌ నుంచి ముంబాయి వరకు బుల్లెట్‌ ట్రైన్‌ కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చుపెట్టారనీ, దాని ప్రయోజనం సామాన్యుల కు అంతంతే అని చెప్పారు. కొందరి కోసం అంత ఖర్చుపెట్టగా లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలను ఖర్చుపెడితే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైందని విమర్శిం చారు. 45 ఏండ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్‌ ధర మనదేశంలోనే ఉందని చెప్పారు. నాలుగు వందల రూపాయల సిలిండర్‌ ధరను 12వందలు చేసి మన ఆడ బిడ్డలకు ప్రధాని మోదీ విలువైన కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. పెట్రోలు ధర ఎక్కువ గల మూడో దేశం మనదేనన్నారు. ఈ హైయెస్ట్‌ ఘనతలే కాదు మోడీ ఘనకార్యాలు, అమలు కాని హామీలు ఇంకా చాలా ఉన్నాయన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపేది? సొంతిల్లు ఏది?
2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్‌ మోడీ సర్కారును ప్రశ్నించారు. దేశంలోని ప్రతి పౌరుడికి సొంత ఇల్లు కట్టిస్తాం.. దేశమంతా బుల్లెట్‌ రైళ్లు పరుగెత్తిస్తాం..2022కల్లా దేశంలోని ప్రతి ఇంటికి కరెంటు ఇస్తాం అని మోడీ హామీలిచ్చారని తెలిపారు. వీటిలో ఒక్కటైనా నెరవేరిందా? అని ప్రశ్నించారు.
బీసీ కులగణన ఎందుకు చేయట్లేదు?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ కులగణన ఎందుకు చేయట్లేదు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 2004లో కేసీఆర్‌ కేంద్ర మంత్రి గా ఉన్న సమయంలో బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యను అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దగ్గరకు తీసుకెళ్లి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు బడ్జెట్‌లో కేటాయిం పులు చేయాలని కోరిన విషయాన్ని ప్రస్తావిం చారు. అప్పటి నుంచి ఆయన ప్రధానులు, మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని చెప్పారు. కానీ, ఆయన కోరిక నెరవేరలేద న్నారు. 45 లక్షల కోట్ల దేశబడ్జెట్‌లో బీసీలకు 2వేల కోట్లు మాత్రమే కేటాయించడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
విభజన హామీలపై మాట్లాడరెందుకు?
రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందే క్రమంలో, మంచి విద్యనందిస్తున్న గురుకులాల్లో ఏదో చిన్న ఘటన జరిగినా అక్కడికెళ్లి నానా హడా విడి చేసి రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలు రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తాము ఉద్యోగుల కు 73 శాతం వేతనం పెంచామని చెప్పారు. కేవలం14 శాతమే ఉద్యోగులకు వేతనం పెంచి నోళ్లు తమకు చెప్పొస్తున్నారని విమర్శిం చారు. కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలి స్తామన్న హామీని విస్మరించగా.. తెలంగాణలో మాత్రం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.
రాహుల్‌గాంధీ పరోక్ష విమర్శలు
కీలకమైన గుజరాత్‌లో శాసనసభ ఎన్నిక లు జరుగుతుంటే పాదయాత్ర చేస్తున్న ఓ నాయకుడు ఆ రాష్ట్రాన్ని వదిలి పక్క నుంచి వెళ్లిపోయారంటూ రాహుల్‌గాంధీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ పరోక్ష విమర్శలు చేశారు. అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలులో విఫలం కావడం వల్లనే పోడు సమస్య ఇప్పటికీ అలాగే ఉండిపోయిం దన్నారు. ఆ సమస్య పరిష్కారం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.