నాందేడ్‌లో సభకు భారీ ఏర్పాట్లు

– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ నెల ఐదున మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ సభకు సీయం కేసీఆర్‌ పాల్గొననున్ననేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మెన్‌ బాలమల్లు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. నాందేడ్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు సభకు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత పొరుగు రాష్ట్రంలో తొలి సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామని చెప్పారు. ఈ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్లడించారు.