నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

– మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానానికి చేరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆకాంక్షించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్‌ ఆస్పత్రుల పనితీరుపై ఆయన బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో అందరం కలిసి చేస్తున్న కృషి వల్ల వైదారోగ్య రంగంలో దేశంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందన్నారు. అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమకూర్చుకుంటున్నామని వివరించారు. అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తున్నామని చెప్పారు. 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించామని అన్నారు. మెడికల్‌ కాలేజీల్లో 201 ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. కొత్తగా 800 మంది పీజీ ఎస్‌ఆర్‌లను జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీలకు, వైద్యవిధాన పరిషత్‌ ప్రధాన ఆస్పత్రులకు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆస్పత్రుల్లో ‘రౌండ్‌ ద క్లాక్‌’ వైద్యులు అందుబాటులో ఉండాలని కోరారు. రోగులు ఏ సమయంలో వచ్చినా అందుబాటులో ఉండి చికిత్స అందించాలని సూచించారు. అనవసర రిఫరల్స్‌ తగ్గించాలనీ, స్థానికంగా చికిత్స అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజరుకుమార్‌, డీపీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.