న్యాయమూర్తికే నోటీసుపై హైకోర్టు ఆగ్రహం

నవతెలంగాణ – హైదరాబాద్‌
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీ దేవి వద్ద టూరిజం శాఖకు చెందిన కేసు విచారణ సమయంలో న్యాయవాది బాల ముకుంద్‌రావు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆ న్యాయమూర్తికే నోటీసు జారీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిం చింది. న్యాయమూర్తికి నోటీసు ఇవ్వడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించే అంశంపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం విచారించింది. క్షమాపణలు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని, జడ్జికి ఇచ్చిన నోటీసును వాపస్‌ తీసుకోవాలని సూచించింది. లేదంటే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరిం చింది. జడ్జికి నోటీసు ఇవ్వడం న్యాయవాద నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి న్యాయవాదిగా కూడా అతడిపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పింది. విచారణను 17కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కేసుపై సోమవారం తీర్పు…
ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రతినిధులు ఎర వేశారనే కేసులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ ప్రభుత్వం వేసిన అప్పీల్‌పై హైకోర్టు సోమవారం తన తీర్పును వెలువరించనుంది. ఆ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ ప్రభుత్వం, సిట్‌, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వేసిన అప్పీళ్లపై గత నెలలో వాద ప్రతివాదనలు పూర్తయ్యాయి. వాటిపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ సోమవారం తీర్పును వెలువరించనుంది.
రూరల్‌ ప్రాక్టీస్‌ చేయాల్సిందే..
వైద్య విద్యకు సంబంధించి పీజీ స్టడీస్‌ పూర్తయ్యాక ఒక ఏడాది రూరల్‌ ఏరియాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రాక్టీస్‌ చేయాలన్న ప్రభుత్వ నిబంధనను హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్‌పై డాక్టర్‌ అభినవ్‌ సింగాలా తదితరులు వేసిన రిట్లపై విచారించిన జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం ఏడాదిపాటు గ్రామాల్లో వైద్య సేవలందించాలని చెప్పారు.
నామాపై ఈడీ కేసులో స్టేటస్‌కో
బ్యాంకు నుంచి రుణం తీసుకుని వేరే కంపెనీలకు మళ్లించారంటూ ఈడీ నమోదు చేసిన కేసులో ఎంపీ నాగా నాగేశ్వరరావు, ఆయన కొడుకు పృథ్వీ తేజలకు ఊరట లభిం చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులు కానప్పు డు ఈడీ కేసు నమోదు చేసి తమ ఆస్తులను సీజ్‌ చేయడం అన్యాయమంటూ నామా తదితరులు వేసిన రిట్‌ను చీఫ్‌ జస్టిస్‌ భూయాన్‌ విచారించారు. ఈడీ వాదనల కోసం విచా రణను వచ్చే నెల 3కి వాయిదా వేశారు. అప్పటి వరకు ఆ కేసు విచారణ యథాతథంగా ఉంచాలంటూ ఆదేశించారు.