పట్టాలివ్వండి

– రెవెన్యూ అధికారులకు సీఎస్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పేదల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబరు 58, 59, 76 ఉత్తర్వుల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై శనివారంనాడామె జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మంచిర్యాల, సిద్ధిపేట, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. పెండింగ్‌ ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు కషిచేయాలని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఈ జీవోలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, సిసిఎల్‌ఏ ప్రత్యేక అధికారి సత్యశారద, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.