పాటల సమాధి

ఆ సాయంత్రం
వేదిక ముందు నిల్చొని ఆమె పాటను విన్నాను
అంతా ఆమె గొంతును మెచ్చుకుంటుంటే నవ్వొచ్చింది
వాళ్ళకు తెలీదు కదా
పాట ఆమె గుండెలోంచి ఉబికే కన్నీటి గతమనీ

మా వాళ్ళంతా కలిసి
ఆమె చుట్టూ పోలికలు పేర్చారు
జానకమ్మలాంటి గొంతు అని
సుశీలమ్మలాంటి రాగమనీ
ఒక్కరికీ
ఆమె పాట ఆమెదిలా అనిపించలేదు
అదీ విషాదం

నేను ఎన్నో సార్లు
ఆమె పాట సాయం తీసుకున్నాను
ఊపిరి తీసుకోవడం కష్టమైనపుడు
కిటికీ రెక్క తెరవడానికి
బయట ఉక్కపోత మరీ ఎక్కువైనపుడు
వెనక్కి వెళ్ళి ఉమ్మ నీట్లో ఈదడానికి
చీకటి అరణ్యంలో దారి తప్పిపోయినపుడు
గుప్పెడు ధైర్యాన్ని వెలిగించుకోవడానికి

చాలా సార్లు
నిద్రలోంచి హఠాత్తుగా లేచి
ఆమె పాట కోసం లోపలంతా వెతికేవాణ్ణి
ఏదో చరణాన్ని కావలించుకుని పడుకుంటే
నిద్రపట్టేది

అవకాశం పేరు చెప్పి
ఒక ఊడిగం నన్ను
నగరానికి ఎగరేసుకుపోయినపుడు
వెళ్తే వెళ్ళాను కానీ
ఉత్తి చేతులతో పోలేదు
ఆమె పాటను సూట్‌ కేసులో సర్దుకుని పోయాను

ఏళ్ళు గడుస్తున్నాయి
నగరం నా వెనకాల వలలు పన్నింది
పాటతో అల్లుకున్న ప్రపంచం
ప్రవరుడు కళ్ళ చుట్టూ దిద్దుకున్న కాటుకలా కరిగిపోయింది
ఎముకలు మూలిగినపుడల్లా
ఆమె పాట నన్ను జోకొడుతూనే వుంది

ఆ రోజు
నాన్న ఆఖరి చూపు కోసం
ఊరు నన్ను పిలిస్తే వెళ్ళినప్పుడు
వీధి వీధిలో గాలించాను
ఇల్లు ఇల్లూ తిరిగాను
ఏ లాలిపాటలోనో
ఏ పొలం గట్టు మీదో
ఏ రాత్రి కంచంలో బువ్వ మెతుగ్గానైనా
ఆమె పాట దొరుకుతుందని

కొన్నాళ్ళ తర్వాత
నేను ఊరమ్ముకుని వెళ్ళిపోతుంటే
పొలిమేర పరుగెత్తు కొచ్చి వగరుస్తూ చెప్పింది
ఇదిగో ఇది ఆమె సమాధి వుండే అడ్రస్సు
తవ్వుకో… పాటలేమైనా దొరుకుతాయేమో
చీటీలో ‘ఫలానా పాట’ ష/శీ వంటిల్లు అని రాసుంది
అవును! పాటలన్నీ సమాధి చేయబడేది అక్కడేగా

నా చిటికెనవేలికి నిప్పంటుకుంది
త్వరగా వెళ్ళాలి
కనీసం ఒక్క పాటనైనా మిగుల్చుకోవాలి

– సామూ, 9642732008