ప్రజాబలంతో ఎదుర్కొంటాం..

– అర్ధబలం, అంగ బలంతో బీజేపీ : సీతారాం ఏచూరి
– రాష్ట్రంలో తిరిగి ప్రజస్వామ్యం రావాలన్నదే ప్రజల ఆకాంక్ష
– త్రిపురలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరాం..
అర్ధబలం, అంగబలంతో త్రిపుర ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వామపక్షాలు, కాంగ్రెస్‌ కూటమి ప్రజాబలంతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య, రాజ్యాంగ బద్ధమైన పాలన ఏర్పడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 16న జరగనున్నది. వామపక్షాలు, కాంగ్రెస్‌ ఒక కూటమిగా అధికార బీజేపీని ఎదుర్కొంటున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే వామపక్షాలు, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయి. ఎన్నికల ప్రచారం నిమిత్తం త్రిపురలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏచూరి శనివారం న్యూస్‌ వెబ్‌పోర్టల్‌ ‘న్యూస్‌ క్లిక్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
త్రిపురలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రజల మూడ్‌ ఎలా ఉంది?
ప్రస్తుతం త్రిపుర ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారు. గత ఐదేండ్లుగా దాడులు, బెదిరింపులతో సీపీఐ(ఎం)ను దెబ్బకొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. అధికార బీజేపీ ఎంతోమంది వామపక్ష కార్యకర్తలను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ బద్ధమైన పాలన లేదు. ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. దీంతో ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఎన్నికల ర్యాలీల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ఎన్నికల పోలింగ్‌ తేదీకి ఐదు రోజుల ముందు త్రిపురకు ప్రధాని మోడీ వస్తున్నారు. అమిత్‌ షా పర్యటించబోతున్నారు. రెచ్చగొట్టే ప్రసంగలతో ఓటర్లను ప్రభావితం చేయటమే వారి పని. అధికారం, ఆర్థిక బలంతో ఎన్నికల్లో గెలవాలన్నది బీజేపీ వ్యూహం. ప్రజాబలంతోనే బీజేపీని ఓడించగలం. ఈ విషయాన్ని వామపక్షాలు, కాంగ్రెస్‌ ఓటర్లలోకి తీసుకెళ్తున్నాయి.
కాంగ్రెస్‌తో కలిసి వెళ్లటం కలిసొస్తుందా?
గత ఐదేండ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని.. వామపక్షాలు, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయి. అధికార బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చాం. వామపక్షాల పిలుపును ప్రజలు ఆమోదిస్తున్నారు. ఓట్లు చీలిపోకూడదనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతిపక్షాల చీలితే..అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూర్చు తుందన్నది ప్రజలు గ్రహించారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాల్ని తెలుసుకున్నాకే, కాంగ్రెస్‌..మాతో జతకట్టింది. కొన్నాండ్లుగా వామపక్షాలు, కాంగ్రెస్‌ కలిసి నిరసన ర్యాలీలు చేపడుతున్నాయి.
తిప్రా మోతా..ప్రభావం ఏమేరకు ఉంటుంది?
తిప్రా మోతా మాతో కలిసి రావాలని కోరాం. ఏమైందో తెలియదు.. 42 స్థానాల్లో అభ్యర్థుల్ని తిప్రా మోతా ప్రకటించింది. బీజేపీ ఓటమే లక్ష్యమని మొదట్నుంచీ చెబుతున్న మోతా.. ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా వ్యవహరించలేదు. నిజానికి 18 స్థానాల్లో ఆ పార్టీకి సరైన అభ్యర్థులే లేరు. గిరిజనులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ప్రభావం చూపగలదన్నది మా అంచనా. గత ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్‌టీ కలిసి పోటీ చేశాయి. ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు తిప్రా మోతాలో చేరారు. ప్రాంతమేదైనా ప్రజల మూడ్‌..బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థి, పార్టీ ఏది? అన్నదే ముఖ్య అంశంగా మారింది. గిరిజన బెల్ట్‌లో బీజేపీకి ఒక్క స్థానం కూడా రాదు.
త్రిపుర ఎన్నికల ద్వారా దేశ ప్రజలు అందుకునే సందేశం?
ప్రజలంతా ఒక్కటైతేనే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమనేది సందేశం. ప్రజలు మేల్కోవాలని అనేక సమావేశాల్లో స్వయంగా కోరాను. ప్రజాబలం ఒక్కటే బీజేపీని ఓడించగలదు. ఎన్నికల్ని స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వామపక్షాలు కోరాయి. ఫిర్యాదులు, పిటిషన్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. పోలీసు, ఎన్నికల అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. మద్యపానం, డబ్బు పంపిణీ కాకుండా..అడ్డుకోవాల్సిన బాధ్యత ఈసీపైన్నే ఉంది.

Spread the love