ప్రయివేటు స్కూళ్లలో 50.23 శాతం విద్యార్థులు

– సర్కారు బడుల్లో 49.77 శాతం చేరిక
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 41,369 పాఠశాలల్లో 62,28,665 మంది విద్యనభ్యసించారు. అందులో 11,637 (26.5 శాతం) బడుల్లో 31,28,532 (50.23 శాతం) మంది విద్యార్థులున్నారు. 29,732 (73.5 శాతం) ప్రభుత్వ పాఠశాలల్లో 31,00,133 (49.77 శాతం) మంది విద్యార్థులు చేరారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సోషియే ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో వెల్లడించింది. 2014-15లో సర్కారు బడుల్లో 47.88 శాతం మంది చదివితే, ప్రయివేటు పాఠశాలల్లో 52.12 శాతం మంది విద్యార్థులు చదివేవారు. 2015-16లో సర్కారు పాఠశాలల్లో 46.95 శాతం, ప్రయివేటు స్కూళ్లలో 53.05 శాతం, 2016-17లో ప్రభుత్వ బడుల్లో 46.20 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 53.80 శాతం, 2017-18లో ప్రభుత్వ పాఠశాలల్లో 45.09 శాతం, ప్రయివేటు స్కూళ్లలో 54.01 శాతం, 2018-19లో సర్కారు బడుల్లో 44.30 శాతం, ప్రయివేటు స్కూళ్లలో 55.70 శాతం, 2019-20లో ప్రభుత్వ స్కూళ్లలో 42.91 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 57.09 శాతం, 2020-21లో సర్కారు పాఠశాలల్లో 43.47 శాతం, ప్రయివేటు స్కూళ్లలో 56.53 శాతం, 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 49.77 శాతం, ప్రయివేటు బడుల్లో 50.23 శాతం విద్యార్థులు చదివారు. కరోనా తర్వాత ప్రయివేటు బడుల నుంచి సర్కారు పాఠశాలల్లో విద్యార్థులు చేరుతుండడం గమనార్హం. ఇంకోవైపు మన ఊరు మనబడి, మన ఊరు మనబస్తీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించడం గమనార్హం. రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీల్లో 6,09,922 మంది, 41,369 బడుల్లో 62,28,665 మంది, 2,963 జూనియర్‌ కాలేజీల్లో 9,48,321 మంది, 1,073 డిగ్రీ కాలేజీల్లో 3,84,021 మంది, 1,327 వృత్తి విద్యా కాలేజీల్లో 2,23,427 మంది కలిపి మొత్తం 82,432 విద్యాసంస్థల్లో 83,94,356 మంది విద్యార్థులు చదువుతున్నారు.