ఫేక్‌ జాబ్స్‌…

– మోసపోతున్న నిరుద్యోగులు
              దేశంలో ప్రతి కుటుంబాన్ని వేధిస్తున్న సమస్య..నిరుద్యోగం. దినపత్రికల్లో ఒక చిన్న ప్రకటన కనిపిస్తే.. కొన్ని లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. పలు వెబ్‌సైట్స్‌లో ఉద్యోగాల కోసం వెదుకులాట తీవ్రమైంది. అభ్యర్థుల ఆతృతను ఆసరాగా చేసుకొని ఫేక్‌ జాబ్‌ రాకెట్‌ చెలరేగిపోతున్నది. శిక్షణ పేరుతో అభ్యర్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి..మోసం చేసిన ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివే పలు రాష్ట్రాల పోలీసులు బట్టబయలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉందనడానికి ఇవొక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
– 5 రాష్ట్రాల్లో నష్టపోయిన 50 వేల మంది
– 2020 తర్వాత పెరిగిన మోసాలు
– విదేశాల్లో ఉద్యోగాలంటూ అక్రమంగా లావోస్‌, మయన్మార్‌కు తరలింపు
– దేశంలో నిరుద్యోగ సమస్యకు ప్రత్యక్ష నిదర్శనం : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : జాబ్‌ రాకెట్‌ మోసగాళ్లలో పెద్ద పెద్ద ఇంజనీర్లున్నారు. ఇంటర్నెట్‌ టెక్నాలజీలో గట్టి పట్టున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఒక గ్రూప్‌గా ఏర్పడి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘జాబ్‌ స్కాం’లకు పాల్పడుతున్నారు. ఆకర్షిణీయమైన పేర్లతో ఎంప్లారుమెంట్‌ వెబ్‌సైట్స్‌ను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ డెవలపర్స్‌ను నియమిస్తున్నారు. ఒక కోర్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేసి, వారికి సహాయకులుగా 50 కాల్‌సెంటర్‌ ఉద్యోగుల్ని ఏర్పాటుచేస్తున్నారు. విచారణలో వీరిని పట్టుకోగా ఉత్తరప్రదేశ్‌లోని జమల్‌పూర్‌, అలీఘర్‌ ప్రాంతాలకు చెందినవారని ఒడిషా సీనియర్‌ పోలీస్‌ అధికారి నారాయన్‌ పంకజ్‌ ఇటీవల మీడియాకు వెల్లడించారు.

ఈ రాకెట్‌ బారిన పడిన అభ్యర్థులు శిక్షణ, ఓరియెంటేషన్‌ ప్రోగ్రాం నిమిత్తం రూ.70వేలు చెల్లించారని తెలిసింది. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.3వేలు చెల్లించారు. శిక్షణ కోసం ఎప్పుడు పిలుస్తారా? అని అభ్యర్థులు వేచిచూసి..చూసి..చివరికి మోసపోయామని గ్రహించారు. పోలీసుల్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరగుతోంది. గుజరాత్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషాలలో జాబ్‌ స్కాంపై పోలీసు కేసులు నమోదయ్యాయి. విచిత్రం ఏంటంటే ఈ ఐదు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన జాబ్‌ రాకెట్‌ ఒక్కటే.
ఏకంగా రైల్వే స్టేషన్‌లో నియామకం
ఇలాంటిదే మరో మోసం (జాబ్‌ స్కాం) డిసెంబర్‌లో బయటపడింది. ఈ ఘటనను బీబీసీ రిపోర్ట్‌ చేసింది. మోసగాళ్లు ఏకంగా రైల్వే టికెట్‌ ఎగ్జామినర్‌ ఉద్యోగాల్ని భర్తీ చేశారు. రైల్వే శాఖలో ట్రాఫిక్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌..మొదలైన ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ నిరుద్యోగ అభ్యర్థులెంతో మందిని మోసం చేశారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2లక్షల నుంచి రూ.24 లక్షల వరకు వసూలు చేసినట్టు బీబీసీ వార్తాకథనం పేర్కొన్నది. ఒక నెల రోజులపాటు కొంతమందిని ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో టికెట్‌ ఎగ్జామినర్‌గా నియమించినట్టు కూడా తెలిసింది. జాబ్‌ స్కాం రాకెట్స్‌ నడుపుతున్న అసలు వ్యక్తులు దేశం బయట ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. దుబారు, బ్యాంకాక్‌లలో ఉంటూ, తమ ఏజెంట్లను భారత్‌లో నియమించుకొని జాబ్‌ స్కాంలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
అక్రమంగా విదేశాలకు
విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగే మోసాల కు అడ్డుఅదుపు ఉండటం లేదు. వివిధ రకాల ఎంప్లారుమెంట్‌ వెబ్‌సైట్స్‌ నడుపు తున్న వ్యక్తులు అభ్యర్థులను అక్రమంగా మయన్మార్‌, థాయిలాండ్‌ కు తరలిస్తున్నారు. లావోస్‌, కంబోడియాలకు వెళ్లాక సైబర్‌ క్రైం నేరాల కింద అరెస్టు అవుతు న్నారు. భారత్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉండటమే ఈ జాబ్‌ స్కాంలకు కారణమవుతోందని విశ్లేషకు లు చెబుతు న్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగం లో నియామకాలు లేక పోవటం సమస్య తీవ్రతను మరింత పెంచిందన్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జాబ్‌ స్కాంలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం.
– ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు మెల్ల మెల్లగా విస్తరిస్తున్నాయి. దాంతో పలు కంపెనీలు కొత్త నియామకాలకు ఫులిస్టాప్‌ పెట్టింది.
-భారతదేశ కార్మిక రంగంపైనా మాంద్యం ప్రభా వం తీవ్రస్థాయిలో ఉండబో తోందని అంచనాలు వెలువ డుతున్నాయి.
-2020లో 15-29 ఏండ్ల మధ్య ఉన్న యువకులు ఉద్యోగాలు కోల్పోవటమేగాక, తిరిగి పొంద లేదని ఒక సర్వే చెప్పింది.