బీజేపీ నేత సహా నలుగురి అరెస్ట్‌

– చత్తీస్‌గఢ్‌ చర్చి ధ్వంసం కేసులో…
న్యూఢిల్లీ : చర్చిని ధ్వంసం చేసిన కేసులో స్థానిక బీజేపీ నేత సహా నలుగురిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీన నారాయణ్‌పూర్‌ సిటీలోని పాఠశాల ఆవరణలోని చర్చిని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న ఆగ్రహంతో కొందరు వ్యక్తులు విశ్వదీప్తి క్రిస్టియన్‌ పాఠశాల ఆవరణలోని చర్చిని ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అడ్డుకునే సమయంలో ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారికి తీవ్రగాయాలు కాగా, మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి చర్చి ధ్వంసం, పోలీసు అధికారులపై దాడి తదితరాలకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నారాయణ్‌పూర్‌లో భద్రతా బలగాలను మోహరించామని జిల్లా అధికారి తెలిపారు.