భలే ఎంపిక!

అంబలవనాన్ని పాలిస్తున్న రాజు క్షేమంకరుడు స్వతహాగా చిత్రకళ మీద అభిరుచి కలిగిన వాడు. అతని ఆస్థానంలో ఉండే విధురుడు అనే చిత్రకారుడు మరణించడంతో అతని స్థానంలో కొత్త చిత్రకారుని ఎంపిక కొరకు రాజ్యంలో దండోరా వేయించాడు. విషయం తెలుసుకున్న ఆ రాజ్యంలోని చిత్రకారులే కాకుండా పక్క రాజ్యాలలో ఉండే చిత్రకారులు సైతం ఆ ఎంపికకు వచ్చారు. వచ్చినవారిని వివిధ పరీక్షల ద్వారా వడపోతకు గురి చేయగా చివరకు ముగ్గురు మిగిలారు. వారు శాయనుడు, భీమయ్య, రవి వర్మ. వారిని పిలిచిన మహారాజు ”మీరు ఎంతో నైపుణ్యం గల చిత్రకారులు మీరు వివిధ దశలలో విజయం సాధించి ఈ దశకు చేరుకున్నారు అయితే మీలో ఒక్కరిని మాత్రమే ఎంపిక చేయాలి కాబట్టి నేను ఒక అంశాన్ని ఇస్తాను కేవలం ఐదు నిమిషాలలోనే దానికి సంబంధించిన చిత్రపటాన్ని చిత్రించి ఇవ్వాలి” అనగా ‘అలాగే మహారాజా’ అని అన్నారు వారంతా. అప్పుడు మహారాజు వారికి ”స్వచ్ఛమైన ప్రేమను నిర్వచిస్తూ పటమును గీయమన”గా కేవలం ఐదు నిమిషములలోపే వారు ముగ్గురూ చిత్రపటం గీసి ఇచ్చారు! వాటిని చూసిన మహారాజు ”చిత్రకారులారా ఇదే అంశం మీద ఐదు రోజుల తరువాత మరొక చిత్రాన్ని వేసి తీసుకురండి” అని వారిని పంపించి వేశాడు. ఐదు రోజులు గడిచాయి వారు వేసిన చిత్రపటాలతో ముగ్గురు చిత్రకారులూ వచ్చారు. వారు వేసిన చిత్రపటాలను తీసుకున్న మహా రాజు వాటిని చూసి ”చిత్రకారులారా మీరు వేసిన చిత్రపటాలు బాగున్నాయి అయితే ఇదే అంశం మీద పది రోజుల తర్వాత మరొక చిత్రపటాన్ని వేసి తీసుకురండి!” అనగా ‘సరే అలాగే మహా రాజా’ అని వారంతా ఇంటిదారి పట్టారు. మహా మంత్రికి మహారాజు ఎందుకు ఇలా చేస్తున్నారు ఓకే అంశానికి సంబంధించిన చిత్రపటాలను మరలా మరలా ఎందుకు వేసుకుని రమ్మంటు న్నారో అర్థం కాలేదు. పది రోజులు గడిచాయి ఆ ముగ్గురు చిత్రకారులు వారు వేసిన చిత్రపటాలతో వచ్చి రాజు గారికి అందజేశారు. వాటిని నిశితంగా పరిశీలించిన మహారాజు మీలో రవి వర్మ మాత్రమే విజేత కనుక అతనిని మన రాజ్య ఆస్థాన చిత్రకారుడిగా నియమించడం జరుగుతుందని అభినందించాడు. మిగిలిన వారిని ఘనంగా సన్మానించి ఇంటికి పంపించాడు. ఇదంతా గమనిస్తున్న మహామంత్రి ”మహారాజా మీరు కేవలం రవివర్మని ఎందుకు విజేతగా ప్రకటించారు? మిగిలిన వారిని ఎందుకు ప్రకటించలేదు. అయినా మీరు ఒకే అంశం మీద మూడుసార్లు ఎందుకు చిత్రపటాన్ని వేయమన్నారు వాళ్లు ఏమి వేశారు నాకు అంతా గందరగోళం ఉంది కొంచెం వివరించండి మహారాజా’!” అన్నాడు. అప్పుడు మహారాజు ”మహామంత్రి మనం చేసే ఏ పనిలో అయినా పూర్తిస్థాయిలో నిమగమై దాని మీద దష్టి పెడితేనే విజయం వరిస్తుంది ఒక చిత్రకాడుగా ఎవరైనా సరే ఒక అంశాన్ని ఇష్టంగా పరిశీలించాలి. దాని మీద అధికంగా కషి చేయాలి. నేను అంశం చెప్పి దాని మీద చిత్రపటం వేయమన్నప్పుడు మొదట తక్కువ సమయం ఇచ్చా. అప్పుడు వారు వేసిన పటం తర్వాత ఐదు రోజులు సమయం తర్వాత, పది రోజులు సమయం ఇచ్చి అదే అంశం మీద మళ్ళీ మళ్లీ చిత్రపటం వేసుకురమ్మనగా రవివర్మ మాత్రమే తను మొదటి వేసిన పటాన్ని మరలా మరలా వేస్తూ దానిలోని అంశాలను అభివద్ధి చేస్తూ చక్కగా రూపొందించాడు, మిగిలినవారు మొదట వేసిన పటం రెండవసారి వేయలేదు రెండోసారి వేసిన పటం మూడోసారి వెయ్యలేదు ప్రతిసారి మారుస్తూ వచ్చారు. ఎప్పుడూ కూడా మనం చేసే పనిలో పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది అంతేగాని ప్రతిసారి మనం అభిప్రాయాన్ని మార్చుకుంటూపోతే ఏ ఒక్క అంశంలోనూ పరిపూర్ణత రాదు. రవివర్మ పూర్తిస్థాయిలో పరిపక్వత కలిగిన చిత్రకారుడు అందువల్ల రవి వర్మని విజేతగా ప్రకటించాను” అనగానే మహారాజుకు గల నిశిత పరిశీలనాశక్తి చూసి ఆశ్చర్యపోయాడు మహామంత్రి.
– ఏడుకొండలు కళ్ళేపల్లి,
9490832338

Spread the love