మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు

– రాష్ట్రం వాటా రూ.2,400, కేంద్రం వాటా రూ.600
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మధ్యాహ్న భోజనం (పీఎం పోషణ్‌) కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం వారికి రూ.వెయ్యి చెల్లిస్తున్నామని తెలిపారు. ఇందులో కేంద్రం రూ.400, రాష్ట్రం రూ.600 భరిస్తాయని పేర్కొన్నారు. గౌరవ వేతనం రూ.మూడు వేలకు పెంచడంతో ఇందులో కేంద్రం రూ.600, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 (అదనంగా రూ.2 వేలు) చెల్లిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 60 శాతం, కేంద్రం 40 శాతం నిష్పత్తి ప్రకారం వేతనాన్ని చెల్లిస్తాయని వివరించారు. గతేడాది మార్చి 15న అసెంబ్లీలో మధ్యాహ్న భోజనం వంట కార్మికుల గౌరవ వేతనం రూ.మూడు వేలకు పెంచుతామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 54,201 మంది వంట కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ హర్షం
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల గౌరవ వేతనాన్ని రూ.మూడు వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేతన పెంపు కోసం తమ సంఘం అనేక పోరాటాలను చేసిందని గుర్తు చేశారు. ఇది ముమ్మాటికీ సుదీర్ఘ పోరాటాల వల్ల దక్కిన విజయమేనని తెలిపారు. గతేడాది మార్చి 15న సీఎం చేసిన ప్రకటన ఆధారంగా అప్పటి నుంచి బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెంబర్‌ 8 విడుదలను స్వాగతిస్తూ ఈనెల ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో మండల కేంద్రాల్లో, 12న జిల్లా కేంద్రాల్లో విజయోత్సవ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల హక్కుల కోసం పోరాట కార్యాచరణను తీసుకుని ముందుకు సాగుతామని తెలిపారు.