మా సర్టిఫికెట్లను అనుమతించాల్సిందే…

– ఉన్నత విద్యామండలి వద్ద నాగార్జున వర్సిటీ విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోనే చదివి, పరీక్షలు రాసిన తమ సర్టిఫికెట్లు చెల్లవంటూ చెప్పడం అన్యాయమని నాగార్జున యూనివర్సిటీ బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు వారు ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యా ర్థులు అక్కడే బైటాయించారు. రాష్ట్రాల సరిహద్దు పేరుతో నాలుగు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేయడం తగదని అన్నారు. 2013 నుంచి నాగార్జున వర్సిటీ దూరవిద్యలో చదివిన వాళ్ల సర్టిఫికెట్లు చెల్లుబాటు కావంటూ నోటిఫికేషన్ల లో పొందుపరుస్తున్నారనీ, ఇది ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు వస్తున్న వేళ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి ఇబ్బంది పెట్టడం తగద న్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోక పోతే వందలాది మంది విద్యార్థులు నష్టపోతారన్నారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రిని కలిసి వారు వినతి పత్రం సమర్పించారు.