మూడు రోజుల్లోనే ముగించారు

– తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
– ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 91/10
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 400/10
నవతెలంగాణ – నాగ్‌పూర్‌
జామ్తాలో టీమ్‌ ఇండియా జాతర. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో ఎదురులేని ప్రదర్శన చేసిన భారత్‌.. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై తిరుగులేని విజయం నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమ్‌ ఇండియా.. ఆస్ట్రేలియాను వరుసగా 177, 91 పరుగులకే కుప్పకూల్చింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ అసమానంగా రాణించటంతో నాగ్‌పూర్‌ టెస్టులో గెలుపొందిన భారత్‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఏడు వికెట్లు సహా విలువైన అర్థ సెంచరీ సాధించిన రవీంద్ర జడేజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. సిరీస్‌లో రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీలో జరుగనుంది.
అశ్విన్‌ మాయ
తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ లోటుతో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు అశ్విన్‌ చుక్కలు చూపించాడు. తొలి సెషన్‌లో భారత్‌ దండిగా పరుగులు కొట్టగా.. రెండో సెషన్‌లో బౌలర్లు జోరుగా వికెట్లు కూల్చారు. ఆఫ్‌ స్పిన్నర్‌ వరుసగా బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఖవాజ (5), డెవిడ్‌ వార్నర్‌ (10), రెన్షా (2), హ్యాండ్స్‌కాంబ్‌ (6), అలెక్స్‌ (10)లను అవుట్‌ చేసిన అశ్విన్‌ ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి సైతం వికెట్ల వేటలో చెలరేగటంతో 32.3 ఓవర్లలోనే ఆస్ట్రేలియా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ లోటును సైతం పూడ్చలేని ఆస్ట్రేలియా తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసింది. భారత్‌తో టెస్టుల్లో ఆసీస్‌కు రెండో అత్యల్ప స్కోరు. స్టీవ్‌ స్మిత్‌ (25 నాటౌట్‌, 51 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచాడు. అక్షర్‌, షమి దూకుడు ఓవర్‌నైట్‌ స్కోరు 321/7తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ విలువైన పరుగులు జోడించింది. తొలి సెషన్‌ పూర్తిగా ఆడిన భారత్‌ మరోసారి బ్యాటింగ్‌కు రాకుండా చూసుకుంది. యువ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (84, 174 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా (70) ఆరంభంలోనే నిష్క్రమించినా.. మహ్మద్‌ షమి (37)తో కలిసి అక్షర్‌ మంచి భాగస్వామ్యం నిర్మించాడు. మహ్మద్‌ సిరాజ్‌ (1 నాటౌట్‌, 19 బంతుల్లో) చక్కగా సహకరించాడు. 139.3 ఓవర్లలో 400 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. ఆసీస్‌ యువ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ (7/124) ఏడు వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 177/10 (లబుషేన్‌ 49, స్మిత్‌ 37, అలెక్స్‌ 36, జడేజా 5/47, అశ్విన్‌ 3/42)
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 400/10 (రోహిత్‌ శర్మ 120, అక్షర్‌ పటేల్‌ 84, రవీంద్ర జడేజా 70, టాడ్‌ మర్ఫీ 7/124)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 91/10 (స్మిత్‌ 25, లబుషేన్‌ 17, అశ్విన్‌ 5/37, జడేజా 2/34, షమి 2/13)