మన విశ్వనగరం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు రెండో దశలో శంషాబాద్ విమానాశ్రయం వరకూ లైన్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు షురూ చేసింది. అందుకనుగుణంగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.8,453 కోట్ల మేర సాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రానికి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఇప్పటికే అనేక విషయాల్లో తెలంగాణకు రిక్తహస్తం చూపిన నరేంద్ర మోడీ సర్కార్… మెట్రోపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం స్పందించినా, స్పందించకపోయినా రెండో దశపై కచ్చితంగా ముందుకెళతామంటూ హైదరాబాద్ మెట్రో ఉన్నతాధి కారులు ధైర్యంగా చెప్పటం ముదావహం.
హైదరాబాద్ మహా నగరం లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తామనీ, అందులో భాగంగానే మెట్రో రెండో దశను ప్రారంభించబోతున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే… హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రయివేటు పార్టనర్‌షిప్ (పీపీసీ) ప్రాజెక్టు. కోవిడ్ కంటే ముందు, ఆ తరువాత కూడా ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు ఎక్కువ మంది యువత తరలిరావటం, కరోనా తర్వాత వివిధ సంస్థలు, కార్యాలయాలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలను ప్రారంభించటం తో మెట్రోకు మరింత ఊపొచ్చింది. దీంతో ఇప్పుడు రెండో దశకు సర్కారు శ్రీకారం చుట్టబోతుండటం హర్షించదగిన విషయం.
హైదరాబాద్ అనేది మహానగరం స్థాయి నుంచి విశ్వనగరం స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నాం. హైదరాబాద్ నగర పాలక సంస్థ (ఎమ్‌సీహెచ్) కూడా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎమ్‌సీ)గా దశల వారీగా రూపాంతరం చెందింది. కోటిన్నర జనాభాతో దేశంలోనే అతి పెద్ద ఐదో నగరంగా అవతరించింది. ఇటు చౌటుప్పల్ నుంచి అటు రాయదుర్గం వరకూ, ఇబ్రహీంపట్నం నుంచి శామీర్‌పేట దాకా జీహెచ్‌ఎమ్‌సీ తన పరిధిని విస్తరించు కుంటూ పోయింది. ఈ క్రమంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను ఆయా ప్రాంతాల వరకూ విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన్నే ఉంది. తద్వారా నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లను మరింతగా తగ్గించొచ్చు. వాహనాల కాలుష్యం నుంచి జనాలకు ఎంతో ఉపశమనం కలిగించొచ్చు. అన్నింటికీ మించి మెట్రోతో పోలిస్తే ఎమ్‌ఎమ్‌టీఎస్ విస్తరణకు అయ్యే ఖర్చు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దాని విస్తరణ దిశగా సర్కారు వారు సమాలోచనలు చేయాలి.