యాద్రాద్రిలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం

– ప్రారంభించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను వర్చువల్‌ విధానంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో నూతన కార్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వి.బాలభాస్కర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయ సేవా సలహా కేంద్రం ప్రత్యేకంగా జిల్లాలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనికి డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా గాదెపాక శంకర్‌ నియామకమైనట్టు తెలిపారు. ఈ కార్యాలయం ద్వారా న్యాయ సేవలు, సలహాలు ఉచితంగా పొందొచ్చని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.నవీన్‌రావు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిపాలన న్యాయమూర్తి, హైకోర్ట్‌ జడ్జి జస్టిస్‌ పి.మాధవిదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.దశరథరామయ్య, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కె.మారుతీదేవి, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.నాగేశ్వరరావు, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీపీ రాజేష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.