యాహులో 20% ఉద్యోగులపై వేటు

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో సర్చెంజన్‌ యాహు తన ఉద్యోగుల్లోంచి 20 శాతం పైగా మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తొలగింపుల్లో యాహూ యాడ్‌ టెక్‌ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఉన్నారు. దాదాపుగా 1600 కంటే ఎక్కువ మందిపై వేటు వేసింది. గురువారం ఆఫీసు కార్యకలాపాలు ముగిసే సమయానికే కంపెనీలో 12 శాతం అంటే 1,000 మందిని తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ స్పష్టం చేసింది. మరో 8 శాతం అంటే 600 మందికి వచ్చే ఆరు నెలల్లో ఉద్వాసన పలుకుతామని బాంబు పేల్చింది. లాభదాయకతలేని కంపెనీ ప్రకటన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని యాహు సిఇఒ జిమ్‌ లైన్‌జోన్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు టెక్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.