రాజాసింగ్‌కు మళ్లీ నోటీసులు…

నవతెలంగాణ – హైదరాబాద్
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు పోలీసులు. తాజాగా మంగళ్‌హాట్‌ పోలీసులు.. రాజాసింగ్‌కు నోటీసులు అందజేశారు. కాగా, నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని తెలిపారు. అంతకుముందు, పీడీ యాక్ట్‌ కేసులో రాజాసింగ్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక, పోలీసుల నోటీసులపై రాజాసింగ్‌ స్పందించారు. రాజాసింగ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను.. గో హత్య, మతమార్పిడులు, లవ్‌ జిహాద్‌పై చట్టం చేయాలని కోరాను.. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయి. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే.. నాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.