రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం

– ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌
– ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అన్నారు. శుక్రవారంనాడామె అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఒకనాడు కరెంటు కోతలతో, వ్యవసాయం కుదేలై, తాగునీటి కోసం తల్లడిల్లిన తెలంగాణ ఇప్పుడు అన్నిరంగాల్లోనూ పురోభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పరిపాలనా దక్షత, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లే సాధ్యమైందని తెలిపారు. పెట్టుబడుల స్వర్గధామంగా, ఐటీ రంగంలో మేటిగా, పర్యావరణ పరిరక్షణలో ధీటుగా నిలుస్తున్నదని కొనియాడారు. ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అనేక విజయాలను సాధించి, దేశం నివ్వెరపోయే అద్భుతాలను ఆవిష్కరించిందని అన్నారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు ఉంటే, స్వరాష్ట్రంలో ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు.
తలసరి ఆదాయం పెరిగింది
తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేల నుంచి 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగిందని వివరించారు. అన్ని రంగాల్లో రెట్టింపుస్థాయిలో అభివృద్ధి జరిగిందనీ, పెట్టుబడి వ్యయాన్ని అధికం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిని సాధించిందని ప్రసంసించారు. వ్యవసాయరంగ అభివృద్ధి, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతుబీమా, మూడున్నరేండ్ల రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మాణం అంశాలను ప్రస్తావించారు. 2014-15లో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల సాగునీటి సౌకర్యాలు ఉండగా, ఇప్పుడు 73 లక్షల 33 వేల ఎకరాలకు పెరిగాయని తెలిపారు. ఫలితంగా ధాన్యం దిగుబడి 68.17 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2 కోట్ల 2 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగినట్టు వివరించారు. రాష్ట్ర జీడీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నదని చెప్పారు.
అద్భుతమైన ప్రగతికి సూచికగా…
విద్యుత్‌రంగంలో వ్యవస్థాపక సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లకు పెరిగిందనీ, తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగి, అద్భుతమైన ప్రగతికి సూచికగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్టీల జనాభా దామాషా 10 శాతానికి పెరిగిందనీ, ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచామనీ తెలిపారు. అలాగే 2,471 గిరిజన తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీ హౌదా కల్పించామనీ, ఫలితంగా 3,146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా స్థానిక పాలనలో భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం రూ.1లక్ష 116 ఆర్ధిక సహయాన్ని అందిస్తున్నామనీ, ఇప్పటి వరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లల కుటుంబాలు లబ్ది పొందాయని వివరించారు.
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా…
వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80,039 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నామనీ, 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా లోకల్‌ కేడర్‌ వ్యవస్థను రూపొందించుకున్నట్టు తెలిపారు. 2014 జూన్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 1,41,735 ప్రత్యక్షనియామకాల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యిందనీ, మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు చేపట్టి రాష్ట్రం రికార్డు సృష్టిస్తున్నదని వివరించారు. మిషన్‌ భగీరథ, దళితబంధు, ఆసరా పించన్లు, మత్స్యకారులు, నేత, గీత కార్మికులు, మహిళా సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, విద్యా, వైద్యరంగాల అభివృద్ధి, పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు, శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు అంశాలను గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు.