రివర్స్‌ స్వింగ్‌

– స్పిన్‌ పిచ్‌లపై సరికొత్త ఆయుధం
– ఇరు జట్లకూ సవాల్‌
భారత్‌, ఆస్ట్రేలియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సమరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. టీమ్‌ ఇండియా నాగ్‌పూర్‌లో సాధన చేస్తుండగా, కంగారూలు బెంగళూర్‌లో కసరత్తు చేస్తున్నారు. అగ్ర జట్లు పోటీపడుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పుడు చర్చంతా ‘స్పిన్‌’పైనే. అయితే, స్పిన్‌ పిచ్‌లపై ఇప్పుడు రివర్స్‌ స్వింగ్‌ సైతం బౌలర్లకు సరికొత్త ఆయుధంగా మారింది.
నవతెలంగాణ క్రీడావిభాగం
సరికొత్త ఆయుధం
బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ యాషెస్‌ను తలపిస్తోంది. ఇటు భారత్‌, అటు ఆస్ట్రేలియా ఆధిపత్యం కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. స్వదేశంలో వరుస సిరీస్‌లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు భారత్‌పై భారత్‌లో విజయం సాధించే కాంక్షతో కనిపిస్తోంది. 2016-17 పర్యటనలో ఆస్ట్రేలియాకు ఆరంభంలో ఆధిక్యం లభించినా.. ఆ తర్వాత భారత స్పిన్‌ దాడికి నిలబడలేకపోయింది. దీంతో ఈ ఏడాది భారత్‌లో స్పిన్‌ సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిడ్నీలో ప్రత్యేకంగా తయారు చేసిన స్పిన్‌ ట్రాక్‌పై వారం రోజులు సాధన చేసింది. బెంగళూర్‌లో సైతం స్పిన్‌ పిచ్‌లపై మ్యాచ్‌ పరిస్థితులు సృష్టించుకుని సాధన చేస్తుంది. భారత్‌లో స్పిన్‌ ప్రభావం సహజంగానే ఉంటుంది. కానీ స్పిన్‌ తరహాలో పేసర్లు సైతం విజృంభించే అవకాశం ఉంది. అదే, రివర్స్‌ స్వింగ్‌. బంతిపై మెరుపు చెదిరిపోగానే కెప్టెన్లు పేసర్ల వైపు చూస్తున్నారు. కొందరు పేసర్లు కొత్త బంతితో సైతం రివర్స్‌ స్వింగ్‌ రాబట్టే నైపుణ్యం సాధించారు. భారత్‌-ఏ, ఆస్ట్రేలియా-ఏ బెంగళూర్‌ (2018) అనధికార టెస్టులో రివర్స్‌ స్వింగ్‌తో మహ్మద్‌ సిరాజ్‌ ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక, పాకిస్థాన్‌ పర్యటనల్లో సైతం ఆస్ట్రేలియాకు రివర్స్‌ స్వింగ్‌ దెబ్బ తెలిసొచ్చింది. ‘పాకిస్థాన్‌, శ్రీలంక పర్యటనలకు వెళ్లినప్పుడూ, అందరూ స్పిన్‌ గురించి చర్చించారు. కానీ నేను రివర్స్‌ స్వింగ్‌ ఎదుర్కొనేందుకు ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. 2018లో బెంగళూర్‌లో నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడాను. బంతి రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలిస్తే ఇరు జట్ల పేసర్లు ఎంత ప్రభావం చూపించగలరో అప్పుడే తొలిసారి తెలిసింది’ అని ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ కేరీ పేర్కొన్నాడు.
బజ్‌బాల్‌ ఏం లేదు!
టెస్టు క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు బజ్‌బాల్‌. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు చీప్‌ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కలమ్‌ బాధ్యతలు అందుకోగా.. ఇంగ్లీష్‌ జట్టు ఆటతీరు మారిపోయింది. ఐదు రోజుల ఆటలోనూ ఇంగ్లాండ్‌ ధనాధన్‌ జోరు చూపిస్తుంది. అదే ప్రణాళికలతో ఇటీవల పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను స్వీప్‌ చేసింది. భారత్‌పై ఆస్ట్రేలియా దూకుడు ప్రణాళికలతో రాలేదని అలెక్స్‌ అన్నాడు. ‘నేను ఎక్కువగా స్వీప్‌ షాట్లు ఆడతాను. గాలెలో రెండు టెస్టులు ఆడాను, అక్కడ రెండు రకాల పిచ్‌లు ఎదురయ్యాయి. స్పిన్‌, పేస్‌, స్వింగ్‌.. ఎలా విధమైన పిచ్‌ ఎదురవుతుందనే ఆలోచన లేకుండా ఓపెన్‌ మైండ్‌తో సిరీస్‌కు వచ్చాం. టెస్టు సవాల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇంగ్లాండ్‌ తరహాలో ఎదురుదాడి ప్రణాళికలు మాకు లేవు. ఆస్ట్రేలియా శిబిరంలో ఓ ఆటగాడికి అనువైన శైలిలో అతడు ఆడేందుకు స్వేచ్ఛ ఉంది. అందరూ వ్యక్తిగత శైలి ప్రకారమే ఆడతారు’ అని అలెక్స్‌ తెలిపాడు.
పిచ్‌లపై ఆసక్తి
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఎదురయ్యే పిచ్‌లపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పిన్‌ స్వర్గధామ పిచ్‌లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసే యోచన భారత్‌కు ఉన్నప్పటికీ.. పూర్తిగా ర్యాంక్‌ టర్నర్‌లను తయారు చేసే అవకాశం లేదు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో నాణ్యమైన స్పిన్‌ ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు సైతం ఇక్కట్లు పడ్డారు. షకిబ్‌ అల్‌ హసన్‌, మెహది హసన్‌ మిరాజ్‌లు భారత బ్యాటర్లను వణికించారు. విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారా స్పిన్‌పై సరిగా ఆడటం లేదు. దీంతో స్పిన్‌కు కాస్త మొగ్గు ఉండే పిచ్‌లను తయారు చేయటంపై దృష్టి నిలిపినట్టు తెలుస్తుంది. జీవం లేని పిచ్‌లపై సైతం ప్రభావం వికెట్లు పడగొట్టే ప్రత్యేక ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సొంతం. ప్రత్యర్థి శిబిరం బలాలు, బలహీనతలను సైతం పరిగణనలోకి తీసుకుని టెస్టు మ్యాచ్‌లకు పిచ్‌లను సిద్ధం చేయనున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా తొలి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ఆరంభం కానుంది.