విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి

– మంత్రి హరీశ్‌రావుకు టీపీఎస్వీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌ (2023-24)లో విద్యారంగానికి 24 శాతం, వైద్య రంగానికి 12 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం, సలహాదారు ఎంఎకె దత్తు కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యావైద్య రంగాల్లో పెనుమార్పులు తేవాలనీ, తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన విద్యావైద్యం అందించాలంటూ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని తెలిపారు. ఈ వైపుగా జరుగుతున్న కృషిలో భాగంగా విద్యారంగంలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. టీపీఎస్వీ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో 1,639 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగానికి సంబంధించిన ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించామని వివరించారు. మన ఊరు-మనబడికి కేటాయించిన నిధులు పూర్తిగా విడుదల కాలేదనీ, దానివల్ల పనులు అరకొరగానే జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బడుల్లో పారిశుధ్యం, టీచర్ల కొరత సమస్యలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని అధిగమించాలంటే విద్యారంగానికి కేటాయింపులు బాగా పెంచాల్సిన అవసరముందని సూచించారు. పాఠశాల విద్య 54 శాతం, ఇంటర్‌ విద్య 75 శాతం, డిగ్రీస్థాయిలో 70 శాతం, ఇంజినీరింగ్‌, వృత్తివిద్యలో 90 శాతం ప్రయివేటు రంగంలో కొనసాగుతున్నదని వివరించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అస్థిత్వాన్ని కోల్పోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తగినంత బడ్జెట్‌ కేటాయింపుల్లేక కునారిల్లుతున్నాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి ఖర్చు చేసినప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని సూచించారు. ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటు, బస్తీ దవాఖానాలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ వైద్యరంగాన్ని మెరుగుపరిచాయని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. అయినా 60 శాతానికిపైగా ప్రజలు ప్రయివేటువైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటూ సర్వేలు చెప్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలపాటు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాల్లో అదనంగా ఏరియా ఆస్పత్రులను నిర్మించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రత్యేక అలవెన్సుల ద్వారా ప్రోత్సహించాలని తెలిపారు. అవసరమైన మందుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యావైద్యం అందాలంటే 2023-24 బడ్జెట్‌లో విద్యకు 24 శాతం, వైద్య రంగానికి 12 శాతం నిధులు కేటాయించాలని కోరారు.