వైద్యాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది

– అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి హరీశ్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
వైద్యరంగాన్ని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్ల క్ష్యం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం ఆరేండ్లలో చేసి వైద్యరంగాన్ని బలోపేతం చేశారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయనీ, తాము ఒక్క ఏడా దిలోనే ఎనిమిది వైద్య కళాశాలలు ప్రారంభించామని వివరిం చారు. నాడు 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే, రాష్ట్రం ఏర్పా టు తర్వాత 2790కి పెంచుకున్నామని గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మెడికల్‌ కాలేజీలకు సంబంధించి శాసనసభ్యులు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, డాక్టర్‌ ఎం. సంజరు, మర్రి జనార్థన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే నాలుగు మెడికల్‌ కాలేజీలు వచ్చాయనీ, వరంగల్‌ జిల్లాలో ఐదు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తిలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తా మన్నారు. ప్రతిపక్ష సభ్యులన్న సంగారెడ్డి, ములుగులోనూ మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించినా, రాష్ట్రానికి మాత్రం ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌ మంజూరు చేశారు. అక్కడ కనీస వసతులు లేవని విమర్శించారు. ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా దవాఖానలో ప్రాక్టికల్స్‌ చేసే అవకాశం కల్పించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్‌ కాలేజీల్లో సీట్లు మూడింతలు పెరిగాయ న్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు. ప్రతి జిల్లాలో నర్సిం గ్‌ కాలేజీ, పారామెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారామెడికల్‌ కాలేజీల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతు న్నామని వివరించారు. అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ పద్ధతిని అమలుచేస్తు న్నామని తెలిపారు. కార్పొరేట్‌ దవాఖానల్లో ఉపయోగించే ఎయిర్‌ సాంప్లార్లను కూడా సర్కారు ఆసుపత్రుల్లో ఉపయోగి స్తున్నామని చెప్పారు. నెల రోజుల్లోగా 1457 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీచేసి, మెడికల్‌ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చూస్తామన్నారు. ఈ ఏడాదిలోనే మెదక్‌కు మెడికల్‌ కాలేజీ మంజూరు చేయనున్నామని ప్రకటించారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు : మంత్రి దయాకర్‌రావు
రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. శాసనసభ్యులు గువ్వల బాలరాజు, పద్మా దేవేందర్‌ రెడ్డి, జాజుల సురేందర్‌, జాఫర్‌ హుస్సేన్‌, దానం నాగేందర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పింఛన్లు మంజూరుచేస్తున్నట్టు ప్రకటించారు. సాఫ్ట్‌వేర్‌ సమస్యల వల్ల పింఛన్లకు ఇబ్బంది వస్తున్న చోట సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎక్కడా కూడా ట్రాక్టర్‌, కారు చూసి పింఛన్లు ఆపడం లేదనీ, వారి ఆర్థికపరిస్థితిని బట్టే అందజేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు నెలనెలా మరిన్ని సదరం క్యాంపులు పెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి పింఛన్లు కోసం రూ. 861 కోట్లు ఇవ్వగా, ప్రస్తుతం తెలంగాణలో రూ. 12వేల కోట్లను బడ్జెట్లో కేటాయించామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామంలో వెయ్యి మంది ఉంటే 60, 70 మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో వెయ్యి మంది ఉంటే, కనీసం 600 నుంచి 700 మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. అవసరమైన ప్రతిచోటా పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్రమే బెస్ట్‌:
మంత్రి నిరంజన్‌రెడ్డి
దేశంలోకెల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఆయిల్‌పామ్‌ సాగుకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ పంట సాగు కోసం ప్రోత్సాహాకాలు సైతం ఇస్తున్నట్టు తెలిపారు. సాండల్‌వుడ్‌, టీక్‌వుడ్‌ చెట్లను పెంచడానికి మంచి అవకాశం ఉందని తెలిపారు. శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్‌, బాలరాజు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ఆయిల్‌ పామ్‌ సాగు మొత్తం 1.30 లక్షల ఎకరాలకుగాను ఈ ఏడాదే 62 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు తెలిపారు. ఆతర్వాత పోడు భూముల సమస్యలపై శాసనసభ్యులు పోడెం వీరయ్య, దన్సరి అనసూయ అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యవతిరాథోడ్‌ సమాధానమిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని మాట్లాడారు.
నాలుగు ప్రశ్నలే
శుక్రవారం నాటి ప్రశ్నోత్తరాల్లో మొత్తం 10 ప్రశ్నలకుగాను కేవలం నాలుగు ప్రశ్నలపై మాత్రమే ప్రశ్నోత్తరాల్లో చర్చ చోటుచేసుకుంది. మిగతా ప్రశ్నలకు జవాబులు చెప్పినట్టుగా భావించాలని స్పీకర్‌ ప్రకటించారు. అలాగే పలు బిల్లులను సభలో మంత్రులు ప్రవేశపెట్టారు.