వైద్యారోగ్యశాఖకు రూ.12,161 కోట్లు

– గతేడాది కన్నా రూ.924 కోట్లు అధికం
– బడ్జెట్‌లో 4.18 శాతం కేటాయింపు
– ఇక రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖకు బడ్జెట్‌ స్వల్పంగా పెరిగింది. రాష్ట్ర బడ్జెట్‌ లో ఆ శాఖకు రూ.12,161 (బడ్జెట్‌లో 4.18 శాతం) కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.11,237 కోట్ల కన్నా ఇది రూ.924 కోట్లు అధికం. రాష్ట్రంలో 60 శాతం మందికి పైగా వైద్యసేవల కోసం ప్రయివేటును ఆశ్రయిస్తున్నారని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ఈ శాఖ బలోపేతానికి కనీసం 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ ఈ మారు 4.3 శాతంతో సరిపెట్టింది. అయితే మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రులు, గర్భిణుల పోష కాహారం, కంటి వెలుగు వంటి వాటికి ప్రాధాన్య తనివ్వడం స్పష్టంగా కనిపించింది. ఈ శాఖలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పారామెడికల్‌, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంల జీతభత్యాల పెంపు, రెగ్యులరైజేషన్‌ పై దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్లను తీర్చేలా కేటాయింపులు లేకపోవడంపై విమర్శలు వస్తు న్నాయి. కేటాయించిన మొత్తం రూ.5,595 కోట్లను నిర్వహణ పద్దు కింద, మిగిలిన రూ.6,566 కోట్లను ప్రగతి పద్దు పరిధిలో చూపించారు.. నిర్వహణ పద్దులో ప్రధానంగా మెడికల్‌ కాలేజీలకు రూ.562 కోట్లు, నర్సింగ్‌ కాలేజీలకు రూ.37 కోట్లు, డీఎంఇకి రూ.2,088 కోట్లు, డీహెచ్‌ 1,047 కోట్లు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.578 కోట్లు కేటాయించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని శాశ్వత కార్యక్రమంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించి నట్టుగానే బడ్జెట్‌లో రూ.20 కోట్లు ప్రతిపాదించారు. ఆయుష్‌కు రూ.162 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.605 కోట్లు, ఈహెచ్‌ఎస్‌కు రూ.150 కోట్లు, జేహెచ్‌ఎస్‌కు రూ.45.83కోట్లు, ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.115 కోట్లు ప్రది పాదించారు. ప్రగతిపద్దులో భాగంగా ప్రభుత్వం ముందే ప్రకటించిన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించేందుకు వీలుగా రూ.200 కోట్లను కేటాయించారు. ఈ పథకంతో నాలుగు లక్షల మంది లబ్ది పొందుతారని భావిస్తున్నారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేయనున్న నేపథ్యంలో ఈ ఏడాది మరో తొమ్మిది కాలేజీలు నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు వాటి నిర్మాణానికి రూ.1,033 కోట్లతో పాటు, బోధనాస్పత్రుల నిర్మాణానికి రూ.181 కోట్లను కేటాయించారు. మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రులకు రూ.1,237 కోట్లను ప్రతిపాదించారు. హైదరాబాద్‌ నలువైపులా నాలుగు, వరంగల్‌ ఒకటి మొత్తం ఐదు సూపర్‌ స్పెషాలిటీల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించారు. ఇక స్టేట్‌ సెక్టార్‌ స్కీంలు 108, 104, కేసీఆర్‌ కిట్‌ వంటి వాటికి కేటాయింపుల్లో గతేడాదితో పోలిస్తే పెద్దగా మార్పు లేదు. రోగుల డైట్‌ ఛార్జీలను ఇటీవల పెంచిన నేపథ్యంలో గతేడాది రూ.16 కోట్ల నుంచి ఈ ఏడాది రూ.60 కోట్లకు, అదే విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు భోజనం అందించే కార్యక్రమానికి కొత్తగా రూ.70 కోట్లను కేటాయించారు.