సందడి షురూ

– నేడు ఈవీ బైక్‌ ర్యాలీ
ఈ రేసు ముంగిట వరుస ఈవెంట్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీకి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న హుస్సేన్‌సాగర్‌ తీరంలో 2.835 కిలోమీటర్ల స్ట్రీట్‌సర్క్యూట్‌పై ఫార్ములా ఈ రేసుకు రంగం సిద్ధమవుతుండగా.. మరోవైపు ఈ రేసు ముంగిట హైదరాబాద్‌ వరుసగా ఈవెంట్లు ప్రణాళిక చేశారు. ప్రపంచ ఆటోమోబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) ఏబీబీ ఫార్ములా-ఈ రేసులో పోటీపడేవి అన్నీ ఎలక్రిక్‌ రేసింగ్‌ కార్లే. హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీ రేసులో గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే థర్డ్‌ జనరేషన్‌ రేసు కార్లు దూసుకుపోనున్నాయి. ఫార్ములా-ఈ ఈవెంట్‌ రేసింగ్‌ ప్రియులతో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగానికి సైతం ఉత్సాహం తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సస్టెయినబుల్‌ ఈ ఫ్యూచర్‌లో భాగంగా హైదరాబాద్‌ ఈ మొబిలిటీ వీక్‌ను నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా, నేడు ఎలక్రిక్‌ వెహికిల్స్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 300 మంది స్త్రీ, పురుష రైడర్లు ద్విచక్ర, త్రిచక్ర ఎలక్రిక్‌ వెహికిల్స్‌తో ర్యాలీ చేయనున్నారు. ఎలక్రిక్‌ వెహికిల్స్‌పై అవగాహన కలిగించేందుకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు. ఇక 6న, మొబిలిటీ నెక్ట్స్‌ గ్లోబల్‌ సస్టెయినబుల్‌ సదస్సు ఉండనుంది. పర్యావరణవేత్తలు, వాహన రంగ నిపుణులు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. 7న, సీఏఎస్‌ఈ మొబిలిటీ ది గ్రాండ్‌ స్టార్టప్‌ చాలెంజ్‌లో భాగంగా టీ హబ్‌లో ఎలక్రిక్‌ వెహికిల్స్‌ రంగంలో ఆవిష్కరణలపై చర్చించనున్నారు. చివరగా 8, 9న హైదరాబాద్‌ ఈ మోటార్‌ ఎక్స్‌పో ఉండనుంది. దేశంలో తొలిసారి ఎలక్రిక్‌ వెహికిల్స్‌ ఎక్స్‌పోకు హైదరాబాద్‌కు వేదిక కానుంది. ఈ ఎక్స్‌పోలో ద్వి చక్ర వాహనాల నుంచి ఎస్‌యూ వెహికల్స్‌ వరకూ అన్నింటికి ప్రదర్శించనున్నారు. ఎక్స్‌పో అనంతరం ఫిబ్రవరి 10, 11న హైదరాబాద్‌ గ్రాండ్‌ ప్రీ జరుగనుంది.