సకలకళా వల్లభి సారంగి

చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ‘నవలలు’ పాఠకులకు విరివిగా చేరుతున్నాయి. తెలుగు నవల ఎంతో ప్రాచీనమైంది. 160 ఏండ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. తెలంగాణ సాయుధ పోరాట యోదుడైన అడ్లూరి అయోధ్య రామకవికి ఈ నవల అంకితం చేసారు (రచయిత్రి తండ్రి) రచయిత్రి సీత.
రామప్ప గుడి, శిల్ప సౌందర్యం చూసి… స్ఫూర్తితో ఈ నవల రాసానని రచయిత్రి చెప్పారు. చారిత్రక కథాంశాలు, రాజులు, చక్రవర్తులు, రాణులు, వీరగాధలు ఒకానొక కాలంలో పాఠకుల్ని ఉర్రూతలూగించాయి. అలాగే చందమామ, బాలమిత్ర కథల్లో రాజులు, పాలన, ధర్మం, రాణుల గురించి, బేతాళ మాంత్రిక కథలు పిల్లల్ని ఆకట్టుకునేవి. ఇక ఈ నవల గురించి క్లుప్తంగా చూద్దాం!చక్రవర్తి అర్జున వర్మ, రాజు రుద్ర – రవికాంతులు. వారి గురువు నీలకంఠ వర్మ సాగుతుండటం, చక్రవర్తి సామంతులుగా వారి పాలన… పాములు పట్టడం వాటి విషాన్ని ఔషధంగా మార్చడం అటవీ జాతికి రాణిగా అందగత్తెగా సారంగి ఉండటం, ఆమె రాజుకు నచ్చటం సింహంపై రాజు వేసిన బాణం సారంగి పట్టుకోవటం… పలు మాంత్రిక ఇంద్రజాల విద్యల్లో  సారంగి ప్రావీణ్యం రాజును ఆకర్షిస్తాయి. ఆమె తల్లిదండ్రులు సత్తెమ్మ, జంపన్నలు. సత్తెమ్మను పెండ్లాడిన తీరు సారంగికి తండ్రి చెప్పటం, ఈ కథలో ఓ ప్రత్యేక మలుపు. రాణి విద్యుల్లతాదేవి చెలికత్తెలు చతురిక చాతుర్యల మేధో తెలివితేటలు నవల్లో గమనిస్తాం. సారంగి బృందం చేసే పలు కళా ప్రదర్శనలకు రాజులు ముగ్ధులవ్వడం… సారంగి విషయం చక్రవర్తి అర్జునవర్మకు తెలియడం… రుద్రనే తోసిపుచ్చిన సారంగి వ్యక్తిత్వం.. నాగప్ప అనే శిల్పిని ఇష్టపడటం, చక్రవర్తి, రాజు రుద్రుడు, రవికాంతుడు, సారంగి నల్గురు కలిసి ‘శిల్పి నాగప్పచే నమూనా గుడి కట్టిస్తారు. ఆ గుడికి నాగప్ప గుడిగా పేరు వస్తుంది. సారంగి ప్రతిమను శిల్పకన్నెలుగా గుడి నలువైపులా చెక్కడం… ఆలయం… తటకాలు.. కట్టడం… శిల్పి నాగప్ప – సారంగి కల్సుకోవడం కథ ముగింపు. ఈ నవలలో ‘సారంగి’ పాత్రను ఇంకొంచెం విశిష్టంగా మలచడంలో రచయిత్రి ఇంకాస్త శ్రద్ధ పెట్టినా ఇంకా బాగుండేది. రాజు స్థానంలో శిల్పిని కోరడంలో విశిష్టత బలంగా చెప్పినా బాగుండేది. చక్రవర్తి, సామంతులు, యుద్ధాలు, రాయబారాలు, మంత్రులు, యంత్రాంగం, పల్లెలు, పట్నాలు, కళాకారులు, వారి జీవనం, కోయ ప్రజల ఆచారాలు, భాష, సారంగి, ఆమె తల్లిదండ్రులు, విశిష్ట వ్యక్తిత్వం, రాజాస్థానాలు… సైనికులు, రాజుల వేట… పలు పాత్రలు సన్నివేశాలు నవలంతా నిండుగా ఉన్నాయి. చదివించే మంచి నవల.
సారంగి (నవల)
రచన : చండూరి సీత
పేజీలు : 160, వెల : రూ.150/-
ప్రతులకు : పాలపిట్ల బుక్స్‌, 16-11-20/6/1/1,
విజయ సాయి రెసిడెన్సీ, సలీం నగర్‌,
మలక్‌పేట, హైదరాబాద్‌ – 500036
సెల్‌ : 9848787284; 6301138814.
– తంగిరాల చక్రవర్తి , 9393804472

Spread the love